అక్రమ కట్టడాలు అనుమతులు లేని నిర్మాణలు | - | Sakshi
Sakshi News home page

అక్రమ కట్టడాలు అనుమతులు లేని నిర్మాణలు

Oct 21 2026 8:02 AM | Updated on Oct 21 2026 8:02 AM

కబ్జా కోరల్లో పొట్లి మహరాజ్‌

ఆలయ భూములు

తాండూరు: పట్టణ నడిబొడ్డున ఉన్న పొట్లి మహరాజ్‌ ఆలయ భూముల వ్యవహారం వివాదాస్పదమవుతోంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో స్థానిక అధికారి ఆడింది ఆట.. పాడింది పాట అన్నట్లు తయారైందనే ఆరోపణలు ఉన్నాయి. ఆలయ పాలక మండలి పదవీ కాలం ముగిసి ఆరు నెలలు కావస్తున్నా పనుల్లో మాజీ చైర్మన్‌ ప్రసాద్‌గౌడ్‌ జోక్యం చేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. రెండు రోజుల క్రితం తాండూరు పట్టణంలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ప్రారంభించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అయితే శిలాఫలకంలో చైర్మన్‌గా ప్రసాద్‌గౌడ్‌ పేరు ఉండటం చర్చనీయాంశంగా మారింది. పట్టణంలోని వినాయక చౌక్‌ ప్రాంతంలోని ఆలయ భూముల్లో ఓ ప్రైవేటు స్కూల్‌ యాజమాన్యం తరగతి గదులు నిర్మిస్తోంది. ఈ నెల 15న తాండూరులో షాపింగ్‌ కాంప్లెక్స్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అయితే దీనికి మున్సిపల్‌ అనుమతులు లేనట్లు తెలిసింది.

గడువు ముగిసినా..

2025 ఏప్రిల్‌ 23న పొట్లి మహరాజ్‌ ఆలయ పాలక వర్గం కొలువుదీరింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 23తో వారి పదవీ కాలం ముగిసింది. చైర్మన్‌ పదవీ కాలం ముగిసినా ప్రసాద్‌గౌడ్‌ వివిధ పనుల్లో జోక్యం చేసుకుంటుండం చర్చనీయాంశంగా మారుతోంది. ఓ ప్రైవేటు పాఠశాల నిర్వాహకులు, ఆలయ ఈఓ, పాలక మండలి మాజీ సభ్యులతో సిండికేట్‌గా ఏర్పడి అక్రమ కట్టడాలు, అనుమతులు లేని నిర్మాణాలకు అండగా నిలుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పాలకవర్గం పదవీ కాలం పొడిగించినట్లు అధికారులు చెబుతున్నా అందుకు సంబంధించిన ఉత్తర్వులను మాత్రం చూపడం లేదు. దీంతో పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై దేవాదాయ శాఖ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ నాగరాజ్‌ను ఫోన్‌లో వివరణ కోరగా పాలక మండలి పదవీ కాలం ముగిసిన విషయం వాస్తవమేనని, పొగింపు విషయం ఈఓ నుంచి వివరణ కోరుతామని తెలిపారు. ఈఓ నరేందర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా సరైన సమాధానం ఇవ్వలేదు.

వివాదాలకు నిలయంగా..

పొట్లి మహరాజ్‌ ఆలయం 1.05 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. పాలక మండలి పదవీ కాలం మరో 20 రోజుల్లో ముగుస్తుందనగా అధికారులతో కలిసి ఎలాంటి నిబంధనలు పాటించకుండా వ్యాపారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి షాపింగ్‌ కాంప్లెక్‌, ప్రైవేటు పాఠశాల తరగతి గదులు నిర్మించడం వివాదాస్పదంగా మారింది. ఆ ఆలయం పక్కనే శివాలయం ఉంది. ఇది శిథిలావస్థకు చేరడంతో మూడేళ్ల క్రితం జీర్ణోద్దరణ పనులకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో ప్రభుత్వం మారడంతో చైర్మన్‌గా ఉన్న తర్లపల్లి భానుకుమార్‌ తన పదవికి రాజీనామా చేశారు. తదనంతరం నూతనంగా ఏర్పడిన పాలక మండలి సభ్యులు ఆలయ నిర్మాణ పనులను పక్కన పెట్టి దేవాదాయ శాఖ ఈఓ నరేందర్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి తెరలేపారు. ఆలయ ఆవరణలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాలను ఖాళీ చేయించి ఆరు నెలల్లో దుకాణాలను నిర్మించి ప్రారంభించడం వివాదాస్పదంగా మారింది.

నిబంధనలకు విరుద్ధంగా

ప్రైవేటు స్కూల్‌ తరగతి గదులు,

షాపింగ్‌ కాంప్లెక్స్‌

వ్యాపారుల నుంచి డబ్బు వసూలు చేసి దుకాణాల నిర్మాణం

పాలక మండలి పదవీ కాలం ముగిసినా మాజీ చైర్మన్‌ జోక్యం

ప్రొటోకాల్‌ పాటించడం లేదు

పొట్లి మహరాజ్‌ ఆలయ ప్రాంగణంలో నిర్మించిన దుకాణాల ప్రారంభోత్సవంలో దేవాదాయ శాఖ అధికారులు ప్రోటోకాల్‌ పాటించలేదు. తరతరాలుగా మా కుటుంబ సభ్యులే ధర్మకర్తలుగా ఉన్నారు. శివాలయ జిర్ణోద్దరణ పనులను పక్కన పెట్టి దుకాణాల నిర్మాణానికి అధిక ప్రధాన్యత ఇవ్వడం సరికాదు. ఈఓ నరేందర్‌ రాజకీయాలు చేయడం మానుకోవాలి.

– తార్లపల్లి భానుకుమార్‌, మాజీ చైర్మన్‌,

పోట్లి మహరాజ్‌ ఆలయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement