లోఓల్టేజీ దెబ్బకు రైతు విలవిల | - | Sakshi
Sakshi News home page

లోఓల్టేజీ దెబ్బకు రైతు విలవిల

Oct 21 2026 8:02 AM | Updated on Oct 21 2026 8:02 AM

కేశంపేట: పంట చేతికి వచ్చే సమయంలో విద్యుత్‌ సమస్య రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. గ్రామాల్లో వ్యవసాయ అధికారులు ఉదయం విద్యుత్‌ సరఫరా చేస్తుండటంతో లోఓల్టేజీ సమస్య ఏర్పడి, బోరు మోటార్లు కాలిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. బోరు మోటారు కాలిపోతుండడంతో విసుగు చెంది, చేతికి వచ్చిన పంటను కాపాడుకునేందుకు మండల పరిధిలోని తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన రైతు లాలమోని శ్రీరాములు వినూత్న ఆలోచన చేశాడు. ట్రాక్టర్‌కు డైనమోను ఏర్పాటు చేసుకోని దాని ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసి బోరు మోటార్‌కు సరఫరా చేసుకొని వరి పంటకు నీటిని అందిస్తున్నాడు.

భారీగా ఖర్చు చేసి..

వరి పంటకు 10 నుంచి 15 రోజులు నీటిని అందిస్తే చేతికి వస్తుంది. కానీ లోఓల్టేజీ సమస్యతో బోరు మోటార్‌తో నీరు అందించలేకపోతున్నారు. దీంతో రైతు లాలమోని శ్రీరాములు సుమారుగా లక్ష రూపాయలు ఖర్చు చేసి ట్రాక్టర్‌కు డైనమోను ఏర్పాటు చేశాడు. ప్రతి రోజు 4 నుంచి 5 గంటల వరకు ట్రాక్టర్‌ ద్వారా బోరు మోటార్‌ను నడిపిస్తూ వరి పంటకు నీళ్లు అందిస్తున్నాడు. గంటకు మూడు లీటర్ల డీజిల్‌ చొప్పున ప్రతి రోజు 15 లీటర్ల వరకు డీజిల్‌ ఖర్చు అవుతుంది. బోరు మోటార్‌ కాలిపోతే 10 నుంచి 15 వేల వరకు ఖర్చు అవుతుందని రైతు తెలిపారు. మూడు ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తే నీళ్లు లేక ఇప్పటికే ఒక ఎకరం చేను ఎండిపోయిందని వాపోయాడు. గ్రామంలోనే విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఉన్న రైతులకు లోఓల్టేజీ లేకుండా విద్యుత్‌ను సరఫరా చేయడం లేదని ఆరోపిస్తున్నారు. వ్యవసాయనికి నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. పంటలు సాగు చేసి, దిగుబడి పొందే కీలక సమయంలో విద్యుత్‌ సమస్యలు ఎదురవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్రాక్టర్‌కు డైనమో ఏర్పాటు చేసి వరికి నీరు

ఇప్పటికే రూ.లక్ష పెట్టుబడి.. డీజిల్‌కు 60 వేలు అదనం

పంటను కాపాడుకోవడానికి వినూత్న ఆలోచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement