అనంతగిరి: వికారాబాద్ సమీపంలోని మహిమ మినిస్ట్రీస్ వృద్ధాశ్రమం, దివ్యాంగుల సంరక్షణ కేంద్రాన్ని గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి రాధిక సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆశ్రమంలోని వృద్ధులు, దివ్యాంగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులు, అందుతున్న ఆహారం, వసతి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి సమయానికి పోషకాహారం అందించాలని వైద్యుల సూచనల మేరకు మందులు అందించి అవసరమైన చికిత్స చేయించాలని నిర్వాహకులకు సూచించారు. ఆశ్రమం ప్రాంగణం, వంటగది, భోజనశాల, నివాస గదులు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ బృందం ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించి వైద్య పరీక్షలు చేశారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ న్యాయవాదులు వెంకటేశ్, శ్రీనివాస్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి కాంతారావు తదితరులు పాల్గొన్నారు.


