మొయినాబాద్: డెంగీతో ఓ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని ముర్తూజగూడలో జరిగింది. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సామ రిషితారెడ్డి(17) మణికొండలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. పదిహేను రోజుల క్రితం జ్వరం రావడంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించారు. అయినా జ్వరం తగ్గకపోగా ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండడంతో నాలుగు రోజుల క్రితం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు డెంగీగా నిర్ధారించారు. చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి మృతి చెందింది. ఈ విషయమై మండల వైద్యాధికారులను వివరణ కోరగా యువతి డెంగీతో చనిపోయిందనే విషయం తెలిసిందన్నారు. రిపోర్ట్స్’ వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు చెప్పగలుగుతామని స్పష్టంచేశారు.


