సాక్షి, రంగారెడ్డిజిల్లా: పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో బరిలో నిలిచేందుకు ఆశాహులు పోటీపడుతున్నారు. ఓ వైపు ఓటరు నమోదు కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తూనే.. మరో వైపు అధినేతల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ వేడుకుంటున్నారు. అధికార కాంగ్రేస్‌లోనే కాదు.. ప్రతిపక్ష బీజేపీ, బీఆర్‌ఎస్‌లోనూ టికెట్‌ఫైట్ మొదలైంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్సీ సురభివాణిదేవి పదవీకాలం మార్చి 27తో ముగినుంది. ఈ స్థానానికి మార్చి 29లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్ల నమోదు షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ సోమవారం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఈ స్థానంపై దృష్టిసారించాయి. 2021లో నిర్వహించిన ఎన్నికల్లో మొత్తం 93 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఈ సారి ఓటర్ల సంఖ్యతో పాటు బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఆయా పార్టీలు ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేతలకు సంకేతాలు కూడా ఇచ్చినట్లు సమాచారం. వీరంతా ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో 5.41 లక్షల ఓటర్లు నమోదు చేసుకున్నారు. ఈ సారి వీరి సంఖ్య ఆరున్నర నుంచి ఏడు లక్షలకు చేరవచ్చనే అంచనా. ఆ మేరకు పార్టీల వారీగా ఆశావహులు ఎవరికి వారు జాబితాలో ఓటర్ల పేర్లను నమోదు చేసే పనిలో నిమగ్నమయ్యారు.
హస్తంలో హడావుడి
ఎలాగైనా ఈ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని అధికార కాంగ్రెస్ భావిస్తుండగా, సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్‌ఎస్ యత్నిస్తోంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇప్పటికే జిల్లా ముఖ్య నేతలో సమావేశం అయ్యారు. ఎలాగైనా ఈ సీటును చేజిక్కించుకుని తీరాలని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆశావహులు ఎవరికి వారే ఓటర్ల నమోదుపై దృష్టిసారించారు. ఇప్పటికే పలువురు ఆశావహులు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి తమకే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రైవేటు కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు, పీసీసీ అధికార ప్రతినిధి గౌరి సతీశ్, ఎంఎస్‌ఎన్ కంపెనీ అధినేత మన్నె జీవన్‌రెడ్డి, పార్టీ మీడియా కమిటీ మాజీ చైర్మన్ సామ రాంమ్మోహన్‌రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి భీంభరత్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్‌రెడ్డి, వనపర్తి డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి పోటీపడుతున్నట్లు తెలిసింది. గౌరి సతీశ్ ఇప్పటికే 150 కాలేజీలను చుట్టేశాడు. ఆయా కాలేజీల యాజమాన్యాలు, అధ్యాపకులు, విద్యార్థులు మద్దతును కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు.
సిట్టింగ్‌పై పట్టు కోసం బీఆర్‌ఎస్
ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్సీ సురభివాణిదేవి వయసు, అనారోగ్య కారణాలతో పోటీకి విముఖత చూపుతున్నట్లు తెలిసింది. ఆమె స్థానంలో మంచి గుర్తింపు పొందిన విద్యార్థి, ఉద్యమ నాయకుడిని బరిలోకి దించాలని బీఆర్‌ఎస్ భావిస్తుంది. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలతో సోమవారం సమావేశం అయ్యారు. శాప్ మాజీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, వికారాబాద్‌కు చెందిన స్కూల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేందర్‌గౌడ్, ఎకై ్సజ్ అండ్ బ్రేవరీస్ మాజీ చైర్మన్, టీఎన్‌జీఓ మాజీ అధ్యక్షుడు దేవిప్రసాద్ సహా మరికొంత మంది ముఖ్య నేతలు పోటీలో ఉన్నట్లు తెలిసింది. వీరిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన నాగేందర్‌గౌడ్‌కు ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలిసింది. వృత్తిరీత్యా అడ్వకేట్ అయిన ఆయన కొంతకాలంగా గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ పేరుతో నిత్యం పట్టభద్రుల మధ్య ఉంటున్నారు. ఆయనకు విద్యార్థి, ఉద్యమ నాయకుడిగా గుర్తింపు కూడా ఉంది. పార్టీ అధిష్టానం బీసీ కేటగిరిలో ఆయన పేరును ప్రముఖంగా పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
బీజేపీలోనూ పోటాపోటీ
గతంలో ఇదే స్థానం నుంచి గెలుపొందిన పార్టీ అధ్యక్షుడు రాంచందర్‌రావు సహా ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు మల్లారెడ్డి, షాద్‌నగర్‌కు చెందిన సీనియర్ నేత నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, పార్టీ స్టేట్ జనరల్ సెక్రట్రీలు గౌతంరావు, తూళ్ల వీరేందర్‌గౌడ్, స్పోక్స్ పర్సన్ డాక్టర్ ప్రకాష్‌రెడ్డి, పీవీ నరసింహారావు మనవడు పీవీ సుభాష్, రిటైర్డ్ లెక్చరర్ గంగాపురం వెంకట్‌రెడ్డి, స్పోక్స్‌పర్సన్ అమర్‌నాథ్, మహబూబ్‌నగర్‌కు చెందిన సీనియర్ నాయకుడు పవన్ కుమార్‌రెడ్డి ఆశావహుల జాబితాలో ఉన్నారు. వీరంతా ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ముఖ్య నేతలతో ఒకటి రెండు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది.
ఓటరుగా నమోదుకు అర్హులు
● ఓటర్ జాబితా నమోదు ప్రక్రియకు 2026 నవంబర్ 1ని అర్హత తేదీగా నిర్ణయించారు.
● ఏదైనా వర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన వారు/సమాన విద్యార్హత గలవారు.
● గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి.
● పూర్తి చేసిన ఫారం–18 సహా డిగ్రీ సర్టిఫికెట్లను జత చేయాలి.
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపై ఆశావహుల గురి
మద్దుతు కోసం పార్టీల అధినేతల చుట్టూ ప్రదక్షిణలు
ఉమ్మడి జిల్లా నేతలతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ
పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల నమోదు షెడ్యూల్
నోటిఫికేషన్ జారీ సెప్టెంబర్ 28న
తొలి ప్రచురణ అక్టోబర్ 15న
రెండో ప్రచురణ అక్టోబర్ 25న
దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 6
నమూనా జాబితా నవంబర్ 20
ఓటర్ల జాబితా ప్రచురణ నవంబర్ 25
అభ్యంతరాల స్వీకరణ నవంబర్ 25–డిసెంబర్ 10
అభ్యంతరాల పరిష్కారం డిసెంబర్ 25న
తుది ఓటర్లు జాబితా ప్రచురణ
డిసెంబర్ 30న


