● మాంసంతో హైదరాబాద్ బయలుదేరిన దుండగులు
● షాద్‌నగర్ టోల్ ప్లాజా వద్ద పట్టుకున్న పోలీసులు
● 315 రైఫిల్, 19 బుల్లెట్లు, 13 కిలోల జింక మాంసం స్వాధీనం
● తొమ్మిది మందిపై కేసు, రిమాండ్‌కు తరలింపు
● వివరాలు వెల్లడించిన డీసీపీ శిరీష రాఘవేంద్ర
షాద్‌నగర్: అడవిలోకి చొరబడి తుపాకీతో వేటాడి.. కృష్టజింకను చంపి అక్రమంగా మాంసాన్ని తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన సోమవారం ఉదయం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ శివారులోని రాయికల్ టోల్‌ప్లాజా వద్ద చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను షాద్‌నగర్ డీసీపీ శిరీష రాఘవేంద్ర విలేకరుల సమావేశంలో వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఈదీబజార్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎండీ హజీముద్దీన్ తన స్నేహితులైన ఈదీ బజార్‌కు చెందిన మీర్ ముక్తార్ అలీ, చార్మినార్‌కు చెందిన తాజముల్, సంగారెడ్డి జిల్లా రాంచంద్రాపురానికి చెందిన మీర్ రజా అలీఖాన్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఖుర్రమ్ ఖాన్, మొగల్‌పురాకు చెందిన ఎంబీఏ విద్యార్ధి సయ్యద్ సల్మాన్ అలీ, రాజేంద్రనగర్ శాసీ్త్రపురానికి చెందిన అఫ్రోజ్‌ఖాన్, చార్మినార్‌కు చెందిన అబ్దుల్ అజీజ్, మహబూబ్‌నగర్ జిల్లా ఉట్కూరుకు చెందిన రియాజ్‌లు స్నేహితులు. వీరు శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి బయలులేరి ఆదివారం నారాయణపేట సమీపంలో ఉన్న మరికల్ అటవీ ప్రాంతానికి వాహనాల్లో వెళ్లారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అడవిలో జింకల కోసం వేటాడారు. హజీముద్దీన్ తన లైసెస్సు తుపాకీతో కృష్ట జింకను చంపారు. మిగిలినవారు వెంట తెచ్చుకున్న కత్తులతో వేటాడిన జింకను ముక్కలుగా నరికి, శుభ్రం చేసుకుని, మాంసాన్ని ప్యాక్ చేసుకొని హైదరాబాద్ బయల్దేరారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న షాద్‌నగర్, ఎస్‌ఓటీ పోలీసులు, ఆమనగల్లు అటవీశాఖ సిబ్బంది రాయికల్ టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లోని 9, 39, 50, 51, 57 సెక్షన్లతో పాటు ఆర్మ్ యాక్టు 30 సెక్షన్‌లకు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. జింకను వేటాడి, మాంసాన్ని అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి టెలిస్కోప్ , సైలెన్సర్ అమర్చిన 315 రైఫిల్, 19 బుల్లెట్లు, రెండు టార్చిలైట్లు, ఒక కెనాన్ కెమెరా, రెండు వాహనాలు, 13 కిలోల కృష్ణజింక మాంసం, 8 సెల్‌ఫోన్లు, రూ.28,590 నగదు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వారిలో కార్ మెకానిక్‌లు, సోలార్ పవర్ ఇన్‌స్టాలేషన్‌లో పని చేసే సిబ్బంది, ఐటీ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఓ విద్యార్థి ఉన్నారు. ఈ సమావేశంలో ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ సీతారాం, ఎస్‌ఓటీ పోలీసులు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.


