● టీజీఎస్ ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్
● సౌకర్యాల కల్పనకు మొదటి ప్రాధాన్యత
కొడంగల్: నియోజకవర్గ కేంద్రమైన కొడంగల్ ఆర్టీసీ బస్టాండ్‌కు మహర్దశ పట్టింది. ఎన్నో ఏళ్లుగా విస్తరణకు నోచుకొని బస్టాండ్‌ను ఏకంగా కార్పొరేట్ స్థాయిలో నిర్మాణం చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవతో కొడంగల్‌తో పాటు నియోజకవర్గంలోని కోస్గి, మద్దూరు బస్టాండ్‌లను కూడా నూతనంగా నిర్మించనున్నారు. ప్రయాణికులకు మెరుగైన రవాణాతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తగిన ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిసింది. కేవలం బస్సు సర్వీసులకే పరిమితం కాకుండా వ్యాపారం, వినోదం ఒకే చోట లభించేలా ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ సిస్టం విధానంలో మోడల్ బస్టాండ్లను నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రవాణా శాఖ నుంచి అధికారిక ఆమోదం లభించినట్లు తెలిసింది. ప్రయాణికుల సౌకర్యార్థం షాపింగ్ కాంప్లెక్స్, ఆహ్లాదాన్ని పంచేందుకు గేమింగ్ జోన్లు, హోటల్స్, ఎంటర్ టైన్‌మెంట్ విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. నగరంలో ఉండే మాల్స్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా కొడంగల్ బస్టాండ్‌ను నిర్మించనున్నారు. కొడంగల్‌తో పాటు రాష్ట్రంలో 13 బస్టాండ్లను ఎంపిక చేసింది. అందులో కొడంగల్, కోస్గి, మద్దూరు, నాగర్‌కర్నూల్, రేగొండ, హుజూర్‌నగర్, కోదాడ, కేసముద్రం, హుస్నాబాద్, ములుగు, మధిర, నల్గొండ, కొత్తగూడెంలో ఈ హైటెక్ బస్టాండ్లను నిర్మించనున్నారు.


