అభివృద్ధి, సంక్షేమం వికారాబాద్: మహనీయుల త్యాగాల ఫలితంగా అరాచక రాచరిక వ్యవస్థ అంతమైందని, ప్రజా స్వామ్య వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన ఈ రోజు తెలంగాణ చరిత్రలో ఎంతో ముఖ్యమైనదని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్‌లో తెలంగాణ(విలీన దినం) ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ దీపక్‌తివారి, ఎస్పీ స్నేహమెహ్ర, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన విద్యార్థులను అభినందించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో అందరికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే తెలంగాణ మాత్రం 1948 సెప్టెంబర్ 17న స్వేచ్ఛా వాయువులు పీల్చుకుందన్నారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎందరో మహనీయులు అసువులు బాశారని తెలిపారు. నాటి ప్రధాని నెహ్రూ, హోంశాఖ మంత్రి సర్దార్ పటేల్ చొరవతో సైనిక చర్య ద్వారా మన ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేశారని గుర్తుచేశారు. ఈ రోజును మనం ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకొంటున్నామని పేర్కొన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని స్పీకర్ తెలిపారు.
హామీలన్నీ అమలు చేస్తున్నాం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. అభయ హస్తంలో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు. సంక్షేమ పథకాల అర్హుల జాబితాలో పేర్లు లేనివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్హులందరికి లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.12 వేల చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వివరించారు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, సబ్సిడీ గ్యాస్, గృహజ్యోతి పథకాలు అమలు చేస్తోందన్నారు. రైతు బీమా పథకం ద్వారా బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్సిగ్రేషియా చెల్లిస్తోందన్నారు. 1,00,358 మంది రైతులకు సంబంధించి రూ.849.30 కోట్లు రుణాలను మాఫీ చేయడం జరిగిందన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నట్లు వివరించారు.
విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి
ఆరోగ్య సీ్త్ర పథకాన్ని రూ.10 లక్షల వరకు పెంచినట్లు గుర్తు చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో భాగంగా జిల్లాలోని 924 స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం అందించే కార్యక్రమం విజయవంతంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని వికాసం వైపు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. 72వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు, సన్న రకం వడ్లకు బోనస్ చెల్లిస్తున్నామన్నారు. ఆయిల్ పామ్‌ను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. వెనుకబాటుకు గురైన కొడంగల్ అభివృద్ధి కోసం కడా(కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు వెంకటాచారి, ఉమాశంకర్ ప్రసాద్, జెడ్పీ సీఈఓ సుధీర్, మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనణ్య, వైస్ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచుతాం మహనీయుల త్యాగాల ఫలితమే తెలంగాణకు స్వాతంత్య్రం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఘనంగా ప్రజాపాలన దినోత్సవం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
అధికారుల తీరుపై స్పీకర్ ఆగ్రహం
అనంతగిరి: ప్రజాపాలన దినోత్సవ ఏర్పాట్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమం అనంతరం కలెక్టరేట్‌కు వచ్చిన ఆయన అధికారులు, ప్రజాప్రతినిధు లు, నాయకులతో మాట్లాడారు. విద్యార్థులు, అతిథులకు అరకొరగా స్వీట్లు తేవడంపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఓ ఉన్నతా ధికారికి క్లాస్ తీసుకున్నారు. అందరి ముందే ఇదంతా చోటుచేసుకుంది. స్పీకర్ వెళ్లాక ఆ అధికారి కలెక్టరేట్ ఏఓను పలిచి మందలించినట్టు సమాచారం. ఏఓ తీరుపై కలెక్టరేట్‌లోని ఇతర శాఖల అధికారులు సైతం తప్పు ప ట్టారు. అన్నింటింకి బిల్లులు పెట్టుకునే ఏఓ అరకొరగా ఏర్పాట్లు చేయడంపై మండి పడ్డారు.