అన్నీ అక్రమ నిర్మాణాలే పట్టని నాణ్యతా ప్రమాణాలు అధికారుల తనిఖీలు శూన్యం గాలిలో దీపంలా ప్రాణాలు
మొయినాబాద్: ప్రైవేటు హాస్టళ్లలో విద్యార్థులు ప్రాణాలు ఫణంగా పెట్టి ఉంటున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వరుసగా జరగుతున్న ఘటనలను చూస్తుంటే విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన కలుగుతోంది. రూ.లక్షలు కట్టి పిల్లలను చేర్పిస్తున్న హాస్టళ్లు భద్రమేనా అని తల్లిదండ్రులు కలవరానికి గురవుతున్నారు. ఇటీవల ఢిల్లీలో ప్రైవేటు హాస్టల్ భనం కుప్పకూలిన ఘటనతో వారి ఆందోళన మరింత పెరిగింది.
అనుమతులు లేకుండా ఇబ్బడి ముబ్బడిగా..
మొయినాబాద్ ప్రాంతంలో విద్యా సంస్థలు అధికంగా ఉండటంతో విద్యార్థుల అవసరాలను ఆసరాగా చేసుకుని ప్రైవేటు హాస్టళ్లు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్నాయి. భవన నిర్మాణం నుంచి హాస్టల్ ఏర్పాటు వరకు ఎలాంటి అనుమతులు లేకుండా చకచకా జరిగిపోతున్నాయి. మొయినాబాద్ ప్రాంతం 111 జీవో పరిధిలో ఉండటంతో ఇక్కడ ఎలాంటి నిర్మాణాలకు అధికారిక అనుమతులు ఇవ్వడానికి వీల్లేదు. ఎవరైనా అక్రమంగా నిర్మాణాలు చేపడితే అధికారులు అడ్డుకో వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులు వాటాలు తీసుకుని అక్రమ నిర్మాణాలకు ఆజ్యం పోశారు. మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుంచి అక్రమ నిర్మాణాలు మరింత వేగం పుంజుకున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడు, ఎనిమిది అంతస్తులు కట్టేసి.. ఎలాంటి అనుమతులు లేకుండానే హాస్టళ్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఒక్కో హాస్టల్‌లో వందల మంది..
మున్సిపాలిటీలోని చిలుకూరు, హిమాయత్‌నగ ర్, అజీజ్‌నగర్, మొయినాబాద్‌లో సుమారు 30కి పైగా ప్రైవేటు హాస్టళ్లు ఉన్నాయి. ఒక్కో హాస్టల్‌లో సుమారు 200–400 మంది విద్యార్థులు ఉంటున్నారు. మరికొన్ని భవనాల నిర్మాణం జరుగుతోంది. ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ కళాశాలల విద్యార్థులను ఆసరాగా చేసుకుని భవనాల నిర్మాణం పెరుగుతోంది. ఒక్కో విద్యార్థి నుంచి నెలకు రూ.8–10 వేలు వసూలు చేస్తూ నిర్వాహకులు వ్యాపారం చేస్తున్నారు.
నాణ్యతా ప్రమాణాలకు మంగళం
111 జీవో నిబంధనలు తుంగలో తొక్కి 200–300 గజాల ప్లాటులో 7–8 బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. ఒక్కో భవనంలో సుమారు 70–80 గదులు నిర్మించి హాస్టళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో గదిలో 7–10 మంది విద్యార్థులు ఉంటున్నారు. హాస్టళ్ల ఏర్పాటుకు సైతం ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోవడంలేదు. వాటి నుంచి వచ్చే మురుగునీరు, డ్రైనేజీ, చెత్తా చెదారం అంతా ఖాళీ ప్రదేశాల్లో వదలడంతో పరిసర ప్రాంతాలు దుర్గంధంగా మారుతున్నాయి.
తనిఖీలు కరువు
హాస్టళ్లలో విద్యార్థులకు పెట్టే భోజనం నాణ్యతగా ఉంటోదా.. అగ్నిప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.. భవనానికి అనుమతి ఉందా.. మురుగునీరు, డ్రైనేజీ, చెత్తాచెదారం ఎక్కడ వేస్తున్నారు.. అనే అంశాలపై అధికారులెవరూ తనిఖీలు నిర్వహించకపోవడంతో నిర్వాహకులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. భవనాలు నిర్మించే సమయంలో ప్రజాప్రతినిధులు, టౌన్‌ప్లానింగ్, మున్సిపల్ అధికారులు భారీ మొత్తంలో ముడుపులు తీసుకుని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
జేబీఐటీ కళాశాల ఎదుట ఉన్న
ప్రైవేటు హాస్టళ్లు
అజీజ్‌నగర్ చౌరస్తా వద్ద ఇటీవల షార్ట్ సర్క్యూట్‌తో మంటలు అంటుకున్న హాస్టల్ భవనం
అనుమతులు లేకుండా ఏర్పాటు
మొయినాబాద్ మున్సిపాలిటీలోని అజీజ్‌నగర్ చౌరస్తా సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు హాస్టల్ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇటీవల మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగింది.నాణ్యమైన విద్యుత్ వైర్లు వాడకపోవడంతో లోడ్ ఎక్కువై తీగలు అంటుకుని మంటలు వచ్చినట్లు గుర్తించారు. అదే సమయంలో కరెంటు సరఫరాఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
నెల రోజుల క్రితం ఎన్‌టీఆర్ విద్యా సంస్థలోని హాస్టల్‌లో సుమారు 60 మందికి పైగా విద్యార్థి నులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత నీరు, ఫుడ్ పాయిజన్ దీనికి ప్రధాన కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. చాలా మందిని తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లి వైద్యం చేయించారు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు హాస్టల్‌లో వైద్య శిబిరం నిర్వహించి విద్యార్థినులకు వైద్య సేవలు అందించారు.
ఉన్నతాధికారుల దృష్టికి..
మున్సిపాలిటీ పరిధిలో అనుమతి లేకుండా ప్రైవేటు హాస్టళ్లు నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఫైర్ సేఫ్టీ, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉన్నాయా.. డ్రైనేజీ ఎక్కడ వదులుతున్నారు.. తదితర అంశాలపై త్వరలో తనిఖీలు నిర్వహిస్తాం.
– జాకీర్ అహ్మద్,
మున్సిపల్ కమిషనర్, మొయినాబాద్


