● నిందితుడి అరెస్ట్
మియాపూర్: ఢీ సీజన్ – 10 టీవీ షో టైటిల్ విన్నర్ రాజును మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మి తనతో శారీరక సంబంధం కొనసాగించడంతో పాటు, సుమారు రూ. 12 లక్షల నగదు తీసుకొని మోసం చేశాడంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్టు చేశారు. మియాపూర్ పోలీసులు తెలిపిన మేరకు.. గోకుల్ ప్లాట్స్‌లో ఓ భవనంలో ఓ మహిళ బోటిక్ నిర్వహిస్తోంది. అదే భవనంలోని ఐదవ అంతస్తులో ఢీ పేమ్, చిట్టి మాస్టర్ డ్యాన్స్ స్టూడియోను నడుపుతున్నారు. ఆ స్టూడియోకు రాజు తరచూ వచ్చేవాడు. ఒకే భవనంలో ఉండటంతో బోటిక్ నిర్వహిస్తున్న మహిళతో రాజుకు పరిచయం ఏర్పడి, అది క్రమంగా ప్రేమగా మారింది. తనను పెళ్లి చేసుకుంటానని రాజు హామీ ఇవ్వడంతో కొన్ని సంవత్సరాలుగా అతనితో సన్నిహితంగా ఉన్నట్లు బాధితురాలు తెలిపింది. ఈ క్రమంలో రాజు పలు దఫాలుగా ఫోన్ ద్వారా, నగదు రూపంలో సుమారు రూ. 12 లక్షలు తీసుకున్నాడు. పెళ్లి గురించి అడిగితే వాయిదా వేస్తూ చివరకు పెళ్లి చేసుకోలేనని చెప్పడంతో పాటు మరో అమ్మాయితో తిరుగుతున్నాడని పేర్కొంటూ బాధితురాలు ఈ నెల 9న మియాపూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు రాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


