అనంతగిరి: పొలంలో విద్యుత్ వైర్లు తగిలి ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన వికారాబాద్ మున్సిపల్ పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. వెంకటాపూర్‌తండా సర్వే నంబర్ 121లో తుకారం అనే వ్యక్తికి చెందిన వ్యవసాయ పొలంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. ఉదయం 6:30 గంటలకు సమాచారం అందడంతో పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించగా మృతదేహం కాలుకు విద్యుత్ తీగ ఉన్నట్లు గుర్తించారు. మృతుడు రాళ్లచిట్టంపల్లికు చెందిన లాలయ్య (45)గా గుర్తించారు. ఆరోగ్యం బాగాలేదని చెప్పి, శుక్రవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన తన భర్త తిరిగి రాలేదని మృతుడి భార్య పీలారం లలిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయి చాక్లెట్లువిక్రయిస్తున్న దంపతుల అరెస్ట్
కొత్తూరు: గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న భార్యాభర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ నాగార్జునరెడ్డి కథనం ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన భోలా(42), సుమనాత్రి దేవి దంపతులు. కొంత కాలంగా కొత్తూరు మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో నివాసం ఉంటున్నారు. బీహార్ నుంచి గంజాయి కలిపిన చాక్లెట్లు అక్రమంగా తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. వీరిపై అనుమానం కలిగిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు శనివారం కల్లుదుకాణం వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి సుమారు రూ.2 వేల విలువైన 78 గంజాయి చాక్లెట్లు, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి మృతి
మరొకరికి గాయాలు
ఆమనగల్లు: రోడ్డు ప్రమా దంలో యువకుడు మృతిచెందిన సంఘటన ఆమనగల్లు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం మర్రిగుంత తండాకు చెందిన ఇస్లావత్ అనిల్‌కుమార్ (23) శనివారం రాత్రి కల్వకుర్తి పట్టణంలోని రాయల్ ఎన్‌ఫీల్డ్ షోరూం నుంచి బుల్లెట్ బైక్ తీసుకుని బైక్ మెకానిక్ శశికుమార్‌తో కలిసి ఆమనగల్లు వైపు వస్తున్నారు. ఆమనగల్లు పట్టణంలోని మార్కెట్‌యార్డు వద్దకు రాగానే హైదరాబాద్ నుంచి వేగంగా వచ్చిన కారు యూటర్న్ తీసుకుంటూ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ గాయపడగా స్థానికులు చికిత్స నిమిత్తం వెల్దండలోని ఎన్నం హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ అనిల్‌కుమార్ మృతిచెందాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
కేపీహెచ్‌బీకాలనీ: రుణం ఇప్పిస్తానని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.1.23 కోట్లు వసూలు చేసి మోసం చేసిన ఘటనపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే... నిజాంపేట రోడ్డులో నివాసం ఉండే కోగంటి హరిబాబు రుణం అవసరంతో ఫిబ్రవరి 20న గ్రిడెన్ గ్రూప్ ఆఫ్ సొల్యూషన్స్ సంస్థను సంప్రదించారు. వారు ఆస్తి పత్రాల జిరాక్స్ తీసుకుని రుణ మంజూరు లెటర్ పంపారు. అనంతరం ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.15 లక్షలు తీసుకున్నారు. రుణ మంజూరు పత్రాలు, చెక్కులు చూపించి బీమా, లాయర్ ఫీజు, డాక్యుమెంటేషన్, స్టాంప్ డ్యూటీ పేరుతో మొత్తం రూ.1.23 కోట్లను బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాకు బదిలీ చేయించుకున్నారు. గత ఏప్రిల్ 5న సూరత్ నుంచి హైదరాబాద్‌కు విమాన టికెట్లు బుక్ చేశామని, ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యామని, మరుసటి రోజు ఉదయం 10 గంటలకు కలుద్దామని చెప్పారు. ఆ తరువాత రాలేదు. నాలుగు రోజులు ఫోన్లు ఎత్తలేదు, ఆ తరువాత ఫోన్ స్విచ్‌ఆఫ్ చేశారు. మోసపోయినట్లు గుర్తించిన హరిబాబు పోలీసులను ఆశ్రయించాడు. కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్‌కు బదిలీచేశారు. హరిబాబు ఇచ్చిన ఆధారాల ప్రకారం పోలీసులు 23 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


