వరుస చోరీలు.. చిక్కని చోరులు! | - | Sakshi
Sakshi News home page

వరుస చోరీలు.. చిక్కని చోరులు!

Sep 13 2026 11:21 AM | Updated on Sep 13 2026 11:21 AM

కొందుర్గు: అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా పలు చోరీ కేసులను పోలీసులు ఛేదించలేకపోతున్నారు. ఈ అంశాన్నే దొంగలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. సీసీ కెమెరాలు, ఫింగర్‌ ప్రింట్లు, డాగ్‌స్క్వాడ్‌ వంటి సదుపాయాలు ఉన్నా చోరీలకు పాల్పడిన వారిని గుర్తించకపోవడం విశేషం. కొందుర్గు మండలంలోని శ్రీరంగాపూర్‌లో పది నెలల వ్యవధిలో మూడు ఇళ్లల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన నివాసాలే లక్ష్యంగా రాత్రి వేళ్లల్లో తాళాలు విరగొట్టి, ఇళ్లు గుల్ల చేశారు. శ్రీరంగాపూర్‌ గ్రామానికి చెందిన బేగరి రాజు తన కుటుంబ సభ్యులతో కలిసి గత ఏడాది నవంబర్‌ 18న రామేశ్వరం దేవుని దర్శనానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం విరగొట్టిన దుండగులు బీరువాలోని 4.5 తులాల బంగారు అభరణాలు, 20 తులాల వెండి పట్టీలు, రూ.50 వేల నగదు దోచుకెళ్లారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 9న గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల యాదయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి షాద్‌నగర్‌ వెళ్లారు. మరుసటిరోజు తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం విరగొట్టి బీరువాలో ఉన్న మూడున్నర తులాల బంగారు, 40 తులాల వెండి ఆభరణాలు, రూ.25 వేల నగదును ఎత్తుకెళ్లారు. తాజాగా చాకలి యాదయ్య ఈనెల 2న కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం బయలుదేరి వెళ్లారు. 4న ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళం విరగొట్టి తులంన్నర కమ్మలు, బుట్టాలు, 20 తులాల వెండి పట్టీలు, 20 వేల నగదు ఎత్తుకెళ్లారు. మూడు ఇళ్లల్లో కలిసి దాదాపు 10 తులాల బంగారు అభరణాలు, ఒక కిలో వెండి, ఒక లక్ష రూపాయలు దొంగిలించారు. అయితే అన్ని ఇళ్లల్లోనూ ఒకే విధంగా దొంగలు తమ తెలివిని ప్రదర్శించినట్లు గుర్తించారు. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్‌ చేసుకొని, బీరువాల తాళాలు తీయడం బీరువాలో ఉన్న అభరణాలు,నగదు ఎత్తుకెళ్లడం గమనార్హం. తాజాగా వారం రోజుల క్రితం చాకలి యాదయ్య ఇంట్లో దొంగలు పడగా పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించగా బెడ్‌ కింద గ్లౌజ్‌లు లభించినట్లు తెలిసింది. దొంగలు తమ ఫింగర్‌ ప్రింట్లు గుర్తించకుండా ఉండేందుకు చేతులకు గ్లౌజులు వేసుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా పోలీసులు దొంగలను పట్టుకుంటారా.. లేదా అనేది వేచి చూడాల్సిందే.

శ్రీరంగాపూర్‌లో తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా వరుస దొంగతనాలు

గడిచిన పది నెలల్లో మూడు ఇళ్లలో దొంగల బీభత్సం

ఒక్క కేసును కూడా ఛేదించని పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement