● 5 లక్షల్లో ఒకరికి అలెగ్జాండర్స్ ఫ్యాక్టర్ 7 డెఫిసియన్సీ వ్యాధి
● పండంటి ఆడశిశువు జననం..
● ప్రైవేటులో రూ.40 లక్షలు..‘గాంధీ’లో ఉచితం
గాంధీఆస్పత్రి: రక్తం గడ్డకట్టే అరుదైన రుగ్మతతో బాధపడుతున్న మహిళకు సురక్షిత ప్రసవం విజయవంతంగా నిర్వహించారు సికింద్రాబాద్ గాంధీఆస్పత్రి వైద్యులు. గాంధీఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొ. ఉషారాణి తెలిపిన మేరకు.. సూర్యాపేట జిల్లా ధర్మాపూర్ గ్రామానికి చెందిన యడ్ల లక్ష్మీ (21) ప్రసవం కోసం గతనెల 21న గాంధీఆస్పత్రిలో అడ్మిట్ అయింది. అలెగ్జాండర్స్ కన్జ్‌నిటల్ ఫ్యాక్టర్ 7 డెఫిసియన్సీ వ్యాధి కారణంగా రక్తం గడ్డ కట్టే అరుదైన రుగ్మత ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రసవం సమయంలో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా వైద్యులు నిరంతరం పర్యవేక్షించారు. లక్షలాది రూపాయల విలువైన రికాంబినెంట్ ఫ్యాక్టర్–7 మందును తెలంగాణ కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ప్రత్యేకంగా అందించింది. ఈనెల 11న వైద్యుల పర్యవేక్షణలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఐదు లక్షల మందిలో ఒకరికి అత్యంత అరుదైన అలెగ్జాండర్స్ కన్జ్‌నిటల్ ఫ్యాక్టర్–7 డెఫిసియాన్సీ వ్యాధి ఉంటుందని, ప్రసవ సమయంలో రక్తం గడ్డకడితే తల్లిబిడ్డల ప్రాణాలకే ప్రమాదమని సూపరింటెండెంట్ ప్రొ. ఉషారాణి తెలిపారు. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఇటువంటి ప్రసవానికి సుమారు రూ.40 లక్షలు తీసుకుంటారని, గాంధీఆస్పత్రిలో పూర్తి ఉచితంగా నిర్వహించామన్నారు. గాంధీ గైనకాలజీ వైద్యులు ప్రొ. జానకీ, ప్రొ.శకుంతల, లేబర్‌రూమ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్వేత తదితరులు వైద్య సేవలందించారు.


