లబ్దిదారుల ఫొటోలు లేకుండానే..
కొత్త రేషన్ కార్డుల్లో తప్పుడు వివరాలు
● లబోదిబోమంటున్న లబ్ధిదారులు
● భవిష్యత్తులో అనేక సమస్యలు వస్తాయని ఆవేదన
వికారాబాద్: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ తప్పుల తడకగా మారింది. భవిష్యత్తులో బీపీఎల్ కుటుంబాల గుర్తింపు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో కీలకంగా మారుతాయని చెబుతున్న వీటి ముద్రణలో అనేక తప్పులు దొర్లడం లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. అధికారులు ఇప్పటికే కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించగా, వీటిని అందుకున్న వారు అయోమయానికి గురవుతున్నారు. కార్డులు వచ్చిన ఆనందం, క్షణాల్లోనే ఆవిరవుతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు యాభై వేలకు పైగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయగా, మరో ఎనభై వేల మందికి పాత కార్డుల్లో చోటు కల్పించింది. గతంలో మాదిరిగా సాధారణ కార్డులు కాకుండా స్మార్ట్ కార్డులు అందజేయాలని నిర్ణయించింది. జిల్లాలో మొత్తం 588 రేషన్ దుకాణాలు ఉండగా, 2,88,895 కార్డులు ఉన్నాయి.
అడ్రస్‌లోనూ తప్పులే..
అడ్రస్ ప్రూఫ్ కోసం ఎంతగానో ఉపయోగపడే స్మార్ట్ రేషన్ కార్డులో చాలా మంది చిరునామా వివరాలు తప్పుగా ఉన్నాయి. ఒక్కో చోట గ్రామం పేరే తప్పుగా ప్రచురితమైంది. కొత్తగా ముద్రించిన రేషన్ కార్డులను మండలాల వారీగా విభజించి, తహసీల్దార్లకు అందజేశారు. స్థానిక ఎమ్మెల్యేల సమయం తీసుకుని వీటిని పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పలు మండలాల్లో ఇప్పటికే పంపిణీ ప్రక్రియ ప్రారంభమవగా, మరికొన్ని చోట్ల ఎమ్మెల్యేలు సమయం ఇవ్వడం లేదని ప్రారంభించలేదు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న అధికారికంగా పంపిణీ ప్రక్రియను ప్రారంభించినా, జిల్లాలో ఇప్పటి వరకు యాభై శాతం కూడా పంచలేదు.
కుటుంబ పెద్దగా మహిళను పేర్కొనగా ఆమె ఫొటో కూడా ప్రింట్ చేయలేదు. ఆమె ఒక్క పేరునే కార్డుపై ఉంచారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తేనే మిగిలిన కుటుంబ సభ్యుల పేర్లు పీడీఎఫ్ రూపంలో కనిపిస్తున్నాయి. దీంతో ఈకార్డును అడ్రస్ ప్రూఫ్ కోసం పెట్టే వీలులేకుండా పోయింది. తప్పుల విషయం తెలిపేందుకు టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు.
దోమ మండలం మైలారం గ్రామానికి చెందిన లబ్ధిదారుల ఊరి పేరు మోత్కూర్‌గా ముద్రించారు.
చాలా గ్రామాలకు సంబంధించిన పిన్ కోడ్ వివరాలు తప్పుగా ప్రచురితమయ్యాయి.
పూడూరు మండలం తిర్మలాపూర్‌తండాకు చెందిన కేతావత్ గోపీచంద్ వయస్సు 35 సంవత్సరాలు కాగా కార్డులో 15 ఏళ్లుగా ఉంది.
స్మార్ట్ కార్డుపై లబ్ధిదారుల ఫొటో లేకుండా కేవలం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఫోటోలు మాత్రమే ఉండటంపై విమర్శలు వినిపిన్నాయి.


