● తహసీల్దార్ కార్యాలయం ఎదుట సర్పంచ్, ఉప సర్పంచ్ ఆందోళన
● రాజకీయ కక్షలో భాగమేనని మహిళ ఆరోపణ
దోమ: భర్త ఉండగానే ఒంటరి మహిళ అని సర్టిఫికెట్ ఇచ్చిన రెవెన్యూ అధికారుల తీరును నిరసిస్తూ మంగళవారం గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా దిర్సంపల్లి అనుబంధ గ్రామమైన గోవింద బుడ్యానాయక్ తండాకు చెందిన చంద్యానాయక్‌కు కమ్లిబాయి, శాంతిబాయి ఇద్దరు భార్యలు. మొదటి భార్య కమ్లీబాయికి స్థానిక రెవెన్యూ అధికారులు ఒంటరి మహిళ ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. అయితే, తమకు ఎలాంటి సమాచారం లేకుండా, రహస్యంగా పంచనామా చేసిన అధికారులు తప్పుడు సర్టిఫికెట్ జారీ చేశారని, గ్రామ సర్పంచ్ లాలీబాయి, ఉప సర్పంచ్ సోమ్లానాయక్ ఆరోపించారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు. ఇదిలా ఉండగా, పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, ఉప సర్పంచ్‌కు తాను ఓటు వేయలేదనే కక్షతోనే తనకు పింఛన్ రాకుండా అడ్డుపడుతున్నారని సదరు మహిళ ఆరోపించారు. తన భర్త రెండో వివాహం చేసుకోవడంతో 2022లోనే గ్రామ పెద్దల సమక్షంలో తాము విడిపోయామని చెప్పారు. ప్రస్తుం తన కుమారుడు, కూతురుతో కలిసి నగరంలో జీవిస్తున్నానని తెలిపారు.


