అనంతగిరి: స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మంగళవారం రాజ్యసభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేను ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ కమిటీ హాల్‌లో జరిగే కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ కాన్ఫరెన్స్ సన్నాహక సమావేశం కోసం స్పీకర్ ఢిల్లీ చేరుకున్నారు. ఆయన వెంట ఓఎస్డీ వెంకటేశం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గూడెం మైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్: బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం పట్టణంలో నిరసన ర్యాలీ ఉంటుందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వినాయక చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ఊరేగింపు తీస్తామన్నారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తాండూరు రూరల్: తాండూరు డివిజన్ ఇన్‌చార్జ్ డీఎల్‌పీఓగా రతన్‌సింగ్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో పని చేసిన ప్రవీణ్‌కుమార్ సెలవుపై వెళ్లారు. దీంతో డీపీఓ జయసుధ ఆదేశాల మేరకు పెద్దేముల్ ఎంపీఓగా పని చేస్తున్న రతన్‌సింగ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శులు నిత్యం గ్రామాల్లో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించాలన్నారు. సర్పంచులు, కార్యదర్శులు సమన్వయంతో పని చేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు.
తాండూరు టౌన్: ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం కింద అర్హులైన బీసీ మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాకేష్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 18నుంచి 55 ఏళ్ల లోపున్న నిరాశ్రయులు, నిరు పేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు, నిరుద్యోగులైన బీసీ వర్గాలకు చెందిన మహిళలు అర్హులని పేర్కొన్నారు. టీజీఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా లేదా దరఖాస్తు చేసుకుని, మెప్మా ఆఫీసులో అందజేయాలన్నారు.
కొత్తూరు: జాతీయ ఎస్టీ కమిషన్ కాలుష్య నియంత్రణ మండలి, కలెక్టర్‌కు సిద్ధాపూర్ డంప్‌యార్డుపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసినట్లు జేఏసీ చైర్మన్ రాంబాల్‌నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సిద్ధాపూర్‌లో డంప్‌యార్డు ఏర్పాటు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 641తో సమీపంలోని గిరిజన తండాలతో పాటు 50 గ్రామాల ప్రజలు తమ ఆస్తులు, అస్తిత్వన్ని కోల్పోతారని జేఏసీ సభ్యులు ఇటీవల జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జటావత్ హుస్సేన్‌కు వినతిపత్రం అందజేశారు. దీంతో స్పందించిన కమిషన్ నోటీసులు అందుకున్న 15 రోజుల్లో కమిషన్‌కు పూర్తి వివరాలతో కూడిన వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు.
హుడాకాంప్లెక్స్: సరూర్‌నగర్‌లోని దివ్యాంగుల పునరావాస కేంద్రాన్ని మంగళవారం దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకుడు సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుద్ధిమాంద్యం పిల్లలకు అందిస్తున్న చికిత్స, సేవలను నోడల్ ఆఫీసర్ రమేశ్, పునరావాసకేంద్రం అధికారి అతుల్ శ్రీవాస్తవ ఆయనకు వివరించారు. కేంద్రంలో అందిస్తున్న సేవా కార్యక్రమాలపై సత్యనారాయణ సంతృప్తి వ్యక్తం చేశారు. తనవంతు సహాయసహకారాలు అందిస్తానని తెలిపారు.


