పరిగి: కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్యసమావేశం నిర్వహించారు. మొత్తం 22 అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో బీఆర్‌ఎస్ సర్పంచ్‌లు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో తమ పాత్రపై ప్రశ్నించారు. ప్రభుత్వం సర్పంచ్‌లకు ఇందిరమ్మ కమిటీలో హక్కు కల్పిస్తున్న గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపికలో మాకు ఇబ్బంది కలుగుతుందని అధికారులు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సర్పంచ్ ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు సమావేశ మందిరంలోకి వచ్చి సర్పంచ్‌లకు సర్ధిచెప్పారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ శ్రేణులు జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. పలు శాఖలపై సమీక్షలో విద్యుత్ శాఖ ఏఈ హరికృష్ణపై ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పరిగి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతోందన్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల రైతులు వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలన్నారు. మా పరిపాలననలో నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా తానే చర్యలు తీసుకుంటానని తెలిపారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు రేషన్ స్మార్టు కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సుధీర్, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ పార్థసారథి, తహసీల్దార్ వెంకటేశ్వరి, ఎంపీడీఓ హరిప్రియారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సర్వసభ్య సమావేశానికి పార్టీ నాయకులు
అధికారులు, ప్రజాప్రతినిధులు ఉండాల్సిన సర్వసభ్య సమావేశంలో పార్టీ నాయకులు రావడంపై ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు. ఇందుకు అధికారుల నిర్లక్షమే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి


