బాలికా విద్యకు భద్రతేదీ? | - | Sakshi
Sakshi News home page

బాలికా విద్యకు భద్రతేదీ?

Aug 24 2026 7:27 AM | Updated on Aug 24 2026 7:27 AM

ప్రచారానికే పరిమితమైన షీ టీమ్‌

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం

తాండూరు టౌన్‌: ఆడపిల్లలు ఇప్పుడిప్పుడే ఉన్నత విద్య వైపు అడుగులు వేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా పెద్ద చదువులు చదివించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో దశాబ్ద కాలంగా కళాశాలల్లో బాలుర కంటే బాలికల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. పదో తరగతి, ఇంటర్‌లో ఉత్తీర్ణత శాతంలో కూడా వారే అగ్రస్థానంలో నిలుస్తున్నారు. ఇదిలా ఉండగా సర్కారు కళాశాలల్లో బాలికలకు కనీస సౌకర్యాలు ఉండటం లేదు. ఈ విషయంలో విద్యాశాఖ వెనుకబడి పోయింది. బాలికలకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన అధ్యాపకులే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజవకర్గానికి చెందిన ఓ లెక్చరర్‌ ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం ఇటీవల వెలుగులోకి వచ్చింది. తాండూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న అధ్యాపకుడు యాలాల మండలానికి చెందిన ఓ మైనర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక కుటుంబ సభ్యులు సదరు లెక్చరర్‌కు దేహశుద్ధి చేశారు. కళాశాలకు చెందిన సిబ్బంది మధ్యవర్తిత్వం చేసి విషయం బయటకు పొక్కకుండా చేశారని స్థానికంగా వినిపిస్తోంది.

గతంలో ఓ ప్రైవేటు పాఠశాలలో..

తాండూరు పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఓ బాలికపై ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఆ ఘటన నుంచి తేరుకొక ముందే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అధ్యాపకుడి చేష్టలు వివాదాస్పదంగా మారాయి.

తాండూరు సబ్‌ డివిజన్‌ పరిధిలో మహిళలు, బాలికల రక్షణ కోసం పని చేస్తున్న షీ టీమ్‌ నామ మాత్రపు కార్యక్రమాలతో సరిపెడుతోందనే విమర్శలు వస్తున్నాయి. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు నిత్యం ఆయా గ్రామాల నుంచి వందల సంఖ్యలో బాలికలకు వస్తుంటారు. వీరి భద్రతపై షీ టీమ్‌ సరైన నిఘా పెట్టలేదనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు బాలికలపై అసభ్యకరంగా ప్రవర్తించిన లెక్చరర్‌పై షీటీమ్‌ లేదా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్న తల్లిదండ్రులు

స్కూళ్లు, కళాశాలల్లో పెరుగుతున్న వేధింపులు

ఆకతాయిలుగా మారుతున్న అధ్యాపకులు

కొడంగల్‌కు చెందిన లెక్చరర్‌ తీరుపై సర్వత్రా చర్చ

తాండూరులో ప్రభుత్వ కళాశాల ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ నిర్వాకంపై ఆగ్రహం

విధుల నుంచి తప్పించాలంటున్న బాధిత కుటుంబాలు

తాండూరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జరిగిన సంఘటన దురదృష్టకరం. కళాశాలకు చెందిన బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన అధ్యాపకుడిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఈ విషయమై పోలీసు అధికారులతో మాట్లాడటం జరిగింది.

– శంకర్‌నాయక్‌, ప్రిన్సిపాల్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, తాండూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement