తాండూరు టౌన్: సమయానుకూలంగా బస్సులు నడిపిస్తూ ప్రయాణికులకు ఆర్టీసీపై నమ్మకాన్ని పెంచాలని ఆ సంస్థ రీజనల్ మేనేజర్ శ్రీదేవి అన్నారు. మంగళవారం ఆమె డిప్యూటీ రీజినల్ మేనేజర్ సరస్వతితో కలిసి తాండూరు డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె డ్రైవర్లు, కండక్టర్లతో సమావేశమయ్యారు. డిపో నుంచి రోజు వారీగా తిరుగుతున్న బస్సులు, ఆదాయం, ఖర్చులు తదితర అంశాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం డిపో ఆవరణలో మొక్కను నాటి మాట్లాడారు. మహాలక్ష్మి పథకం ఉచిత టికెట్లతో పాటు, నగదు టికెట్ల జారీపై దృష్టి సారించాలన్నారు. విధుల పట్ల బాధ్యత, క్రమశిక్షణతో మెలిగితే డిపో లాభాల బాటలో నడుస్తుందన్నారు. ప్రయాణికుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ ఆర్టీసి సిబ్బంది ఉన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన ఆర్టీసీ అధికారులు
టీజీ ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీదేవి, డిప్యూటీ ఆర్‌ఎం సరస్వతి, డీఎం ప్రవీణ్ కుమార్ మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, మహాలక్ష్మి పథకం ఆటంకం లేకుండా కొనసాగేలా చూడాలని ఎమ్మెల్యే, ఆర్టీసీ అధికారులకు సూచించారు. తాండూరు డిపో ఎదుట తొలగించిన డబ్బాల స్థానంలో త్వరితగతిన స్టాల్స్ నిర్మించి చిరు వ్యాపారులకు అప్పగించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. డిపోలోని పలు సమస్యలను అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్‌తో మాట్లాడి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
టీజీ ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీదేవి


