నేత్ర పర్వం.. భద్రేశ్వరుడి రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

నేత్ర పర్వం.. భద్రేశ్వరుడి రథోత్సవం

Apr 13 2026 8:14 AM | Updated on Apr 13 2026 8:14 AM

తాండూరు: భావిగి భద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లలో ప్రధాన ఘట్టమైన రథోత్సవం శనివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు శాసన మండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ కల్వ సుజాత, మున్సిపల్‌ చైర్మన్‌ పట్లోళ్ల నీరజ, ప్రధాన పార్టీల నాయకులు, భక్తులు ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి రథంపై ఉంచారు. అనంతరం భక్తులు స్వామి వారి రథాన్ని ముందుకు కదిలించారు. వేలాది మంది భక్తజనం నడుమ రథాన్ని బస్వన్న కట్టవద్దకు తీసుకువచ్చి కట్టవద్ద బస్వన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథాన్ని యథాస్థానికి చేర్చారు. ఈ ఉత్సవాలకు ఆలయ కమిటీ చైర్మన్‌ మహేశ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పట్లోళ్ల నర్సింలు, రాష్ట్ర బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ సందల్‌రాజుగౌడ్‌, నాయకులు డాక్టర్‌ సంపత్‌కుమార్‌, మురళీకృష్ణగౌడ్‌, యు.రమేశ్‌ కుమార్‌, పట్లోళ్ల నర్సింహులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు నియోజవకర్గంతో పాటు కొడంగల్‌, వికారాబాద్‌, పరిగి, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తాండూరు సబ్‌ డివిజన్‌ పోలీసు అధికారులు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి

తాండూరు: భావిగి భద్రేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని రాష్ట్ర బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు శుభప్రధ్‌పటేల్‌ అన్నారు. ఆదివారం ఆయన భద్రేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని దాసోహ భవనంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మహేశ్‌తో కలిసి భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రథోత్సవం తర్వాత పక్షం రోజుల పాటు జాతర కొనసాగుతుందన్నారు. భక్తులకు అన్నదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం ప్రతినిధులు సుధాకర్‌, బస్వరాజ్‌, విజయకుమార్‌, కరుణాకర్‌, వినోద్‌, చందు, పటేల్‌ విజయ్‌కుమార్‌, చందు, నాయకులు రామునాయక్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement