న్యూస్‌రీల్
ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ
మంగళవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2026
వికారాబాద్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు పొటెత్తారు. గతంతో పోలిస్తే రెండింతలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. కొత్త కలెక్టరైనా తమ సమస్యలను పరిష్కరిస్తారనే గంపెడాశతో బాధితులు క్యూ కట్టారు. ఒక్కో సమస్య పరిష్కారానికి ఏళ్ల తరబడి సమయం పడుతుండటంతో అర్జీదారుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. రెవెన్యూ శాఖకు సంబంధించి భూ సమస్యలు అధికంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఇవే కాకుండా చిన్నచిన్న సమస్యలు సైతం పరిష్కారానికి నోచుకోవడం లేదు. దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు ఇలా ఒకరేమిటి అన్ని వర్గాల ప్రజలు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఒక్కొక్కరిదీ ఒక్కో బాధ
గ్రామ, మండల స్థాయిలో పరిష్కారానికి నోచుకోని సమస్యలు కలెక్టరేట్‌లో కొలిక్కి వస్తాయని ప్రజలు క్యూ కడుతున్నారు. కానీ ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉండటంటో ఎవరికి చెప్పుకోవాలో తెలియక నిట్టూరుస్తున్నారు. జిల్లాలో వేల ఎకరాల భూములు నిషేధిత(ప్రొహిబిటెడ్) జాబితాలో పడటం రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. మీసేవా కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాలు, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్, కలెక్టర్ వరకు చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తున్నారు. వచ్చిన దరఖాస్తుల్లో 90 శాతానికి పైగా రిజెక్టు చేసి పంపుతురు. కలెక్టరేట్‌కు వచ్చే బాధితులను పలకరిస్తే వారి బాధలు వర్ణతాతీతం. ఒక్కొక్కరిది ఒక్క వ్యథ. వినే వారికే కన్నీళ్లు తెప్పిస్తాయి కానీ అధికారుల మనసు మాత్రం కరగడంలేదు.
ఆ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలి
ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం ఇచ్చిన భూ సేకరణ నోటిఫికేషన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని పరిగి మండలం రాపోల్, కాళ్లాపూర్ గ్రామాల రైతులు డిమాండ్ చేశారు. వందలాది మంది వచ్చి ప్రజావాణిలో కలెక్టర్‌కు వనతిపత్రం అందజేశారు. ఈ రెండు గ్రామాల పరిధిలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలుమార్లు పరిగిలో ధర్నాలు, ఆందోళన చేశారు. కలెక్టరేట్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తామ భూములు ఇచ్చేదిలేదని తేల్చి చెప్పారు. డబ్బు, ప్లాట్లు ఇంకేమి ఇచ్చినా తాము అంగీకరించమని పేర్కొన్నారు. ప్రభుత్వం భేషరతుగా నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంటలు పండే భూముల్లో పరిశ్రమలు ఎలా పెడతారని ప్రశ్నించారు. భూములు పోతే తాము ఎక్కడికి పోవాలో ప్రభుత్వమే చెప్పాలన్నారు. తమకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు.
కలెక్టరేట్‌కు క్యూ కట్టిన అర్జీదారులు
నెల రోజుల్లో వచ్చే ఫిర్యాదులు ఒక్క వారంలోనే..
కొన్ని సామాజిక.. ఇంకొన్ని వ్యక్తిగత సమస్యలు
ఏళ్లతరబడి దొరకని పరిష్కారం
కొత్త కలెక్టర్‌కు సమస్యల స్వాగతం
ఆదుకోకపోతే చావే శరణ్యం
తమను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని సహారా చిట్‌ఫండ్ కంపెనీ బాధితులు వాపోయారు. సహారా కంపెనీలో 20 ఏళ్లుగా ఏజెంట్లుగా పనిచేస్తూ వస్తున్న వారు ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. వారి మాటల్లో.. జిల్లాలో మొత్తం 800 మంది వరకు ఏజెంట్లు ఉన్నారు. ప్రజల నుంచి దాదాపు రూ.600 కోట్లు సహారాలో జమ చేయించారు. అధిక వడ్డీ వస్తుందనే ఆశతో ఎక్కువ మంది డబ్బు డిపాజిట్ చేశారు. ఒక్క వికారాబాద్ నియోజకవర్గం నుంచే 300 మంది ఏజెంట్లు కలెక్టర్‌ను కలిశారు. తాము రూ. 50 లక్షల నుంచి ఆరు కోట్ల వరకు మొత్తం రూ. 50 కోట్లకు పైగా చిట్ ఫండ్‌లో డబ్బులు కట్టించామని వాపోయారు. ప్రస్తుతం కంపెనీ చేతులెత్తేయడంతో తాము డబ్బులు కట్టించిన కస్టమర్లు ఇళ్లపైకి వచ్చి గొడవలు చేస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. టెన్షన్ తట్టుకోలేక ఇటీవల ఆలంపల్లికి చెందిన యూసఫ్ పాష, పట్లూరుకు చెందిన లక్ష్మయ్య గుండెపోటుతో మృతి చెందారని తెలిపారు. వారి భార్య, పిల్లలు అనాథలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని వారు కలెక్టర్‌ను కోరారు.
జనవరిలో దరఖాస్తులు(4వారాలకు) 200
ఫిబ్రవరిలో 137 ఈనెల 9న (ఒక్కరోజే) 289
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతులది పరిగి మండలం రావులపల్లి. ముగ్గరు అన్నదమ్ములు. మంగలి రామయ్య, కృష్ణయ్య, అంజయ్య పేరిట రెవెన్యూ రికార్డుల్లో పదిహేను ఎకరాల పొలం ఉంది.. వాస్తవంలో మూడెకరాలు తక్కువగా ఉంది. సర్వే చేయించి తమ పొలం హద్దులు చూపాలని మూడేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అనేక సార్లు దరఖాస్తు కూడా చేశారు. అధికారులు వీరి అర్జీలను రిజెక్టు చేసి చేతులు దులుపుకొన్నారు. చివరి ప్రయత్నంగా కొత్త కలెక్టర్‌ను కలిసి వారి బాధను వెల్లబోసుకున్నారు.


