తాండూరు: తాండూరు తొలి మున్సిపల్ సమావేశం వాడీవేడిగా సాగింది. సోమవారం చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డి అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 11 అంశాలతో కూడిన ఎజెండాను ప్రవేశపట్టారు. పలు అంశాలపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ దీపనర్సింహులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పలు అంశాలపై చైర్‌పర్సన్‌కు నోటీసు ఇచ్చారు. మరో రెండు అంశాలను టెబుల్ ఎజెండాలో చేర్చగా సభ్యులు ఆమోదం తెలిపారు. పట్టణ సుందరీకరణ, పెయింటింగ్ పనుల కోసం రూ.8.70 లక్షలు కేటాయించారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు రూ.55 లక్షలు, జేసీబీ మరమ్మతులకు రూ.4.86 లక్షలు, వీధి దీపాల నిర్వహణకు రూ.3 లక్షల కేటాయింపునకు ఆమోదించారు. చెత్త సేకరణ వాహనాలకు మరమ్మతులు చేయించాలని సభ్యులు కోరారు. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సూచనలతో అన్ని పార్టీల సభ్యులకు జీరో అవర్‌లో మాట్లాడే అవకాశం కల్పించారు. పారిశుద్ధ్యం, విద్యుత్, తాగునీరు, మురుగు కాలువలు, ప్రభుత్వ భవనాల నిర్వహణ, ప్రభుత్వ స్థలాల అన్యాక్రాంతంపై కౌన్సిలర్లు సభ దృష్టికి తెచ్చారు.
మోడల్ మున్సిపాలిటీగా మార్చుకుందాం
తాండూరును మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుదామని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు అని, ఆ తర్వాత పట్టణ అభివృద్ధే ధ్యేయంగా సభ్యులు సమన్వయ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కమిషనర్ మధుసూదన్‌రెడ్డి, మున్సిపల్ మేనేజర్ నరేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు శ్రీకాంత్, షేక్ ఇర్షాద్, వెంకట్, సుప్రిత, నవీన, అనిల్, సురేష్‌నాయక్, జావీద్, రూప తదితరులు పాల్గొన్నారు.
తాండూరు తొలి మున్సిపల్ సమావేశంలో ప్రశ్నల వర్షం
ప్రధానంగా పారిశుద్ధ్య సమస్యలపైనే..
13 అంశాలకు సభ్యుల ఆమోదం


