ఇబ్రహీంపట్నం డివిజన్‌లో కార్యాలయం కరువు
● రాయితీల కోసం రైతుల ఇబ్బందులు
● అధికారులను ఎక్కడ కలవాలోతెలియక అయోమయం
యాచారం: ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖకు ఇబ్రహీంపట్నం డివిజన్‌లో అడ్డా కరువైంది. డివిజన్ కింద యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, మాడ్గుల, అబ్దుల్లాపూర్‌మెట్, బాలాపూర్, హయత్‌నగర్, సరూర్‌నగర్ మండలాలు వస్తాయి. ఈ మండలాల కింద 15 వేలకుపైగా రైతులు 40 వేల ఎకరాలకు పైగా పండ్లతోటలు, కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. పండించిన కూరగాయలు, ఆకుకూరలను నగరంలోని పలు మార్కెట్లకు తరలించి విక్రయిస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారు.
కార్యాలయం లేక...
డివిజన్‌లో ఉద్యాన శాఖకు కార్యాలయం లేకపోవడం రైతులకు శాపంగా మారింది. ఇక్కడ ఒక హెచ్‌ఓ (ఉద్యాన శాఖ అధికారి), ఇద్దరు విస్తరణ అధికారులు ఉన్నారు. రైతుల సంఖ్యను బట్టి ఇద్దరు హెచ్‌ఓలు, ఎనిమిది మంది విస్తరణ అధికారులు ఉండాలి. హెచ్‌ఓతో పాటు ఇద్దరే విస్తరణ అధికారులు ఉండడం.. వారు కూడా ఎప్పుడు వస్తారో.. ఏ గ్రామానికి వెళ్తారో.. ఏ రైతును కలుస్తారో తెలియడం లేదు. అప్పుడప్పుడు ఆయా మండల కేంద్రాల్లో ఉన్న రైతు వేదికల వద్దకు వచ్చి మొహం చూపించి వెళ్లిపోతున్నారు. కార్యాలయం ఉంటే ఏదో ఒకరోజు, ఏదో ఒక సమయంలో వస్తారనే భరోసా రైతుల్లో ఉంటుంది. ఏటా అతివృష్టి, అనావృష్టితో పంటలకు తీవ్ర నష్టం జరుగుతోంది. ఆ సమయంలో రైతులు ఎక్కడికి వెళ్లి, ఎవరిని కలవాలో తెలియడం లేదు.
సర్కార్ ప్రోత్సహిస్తున్నా..
గత బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో జిల్లాలోనే ఇబ్రహీంపట్నం డివిజన్‌ను పంట కాలనీల పథకం కింద పైలెట్‌గా ఎంపిక చేశారు. దాదాపు రూ.25 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసి యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల్లోని ఆరు వేల మందికి పైగా రైతులకు ఉచితంగా డ్రిప్ పరికరాలు, యంత్రాలు, బోరుబావుల తవ్వకం, నాణ్యమైన విత్తనాలు, నార్లు ఉచితంగా అందించారు. పండించిన కూరగాయలను నగరంలోని వివిధ మార్కెట్లకు తరలించడానికి ప్రతి మండల కేంద్రంలో కూరగాయల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తాజాగా రేవంత్‌రెడ్డి సర్కార్ సైతం కూరగాయల సాగును ప్రోత్సహించడం కోసం రూ.లక్షలాది నిధులతో రాయితీలు అందజేస్తోంది. యాచారం మండలంలోని మొండిగౌరెల్లి, చౌదర్‌పల్లి, గడ్డమల్లయ్యగూడ గ్రామాలను రైతు కమిషన్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.


