● మృత్యువాత పడుతున్న పశువులు
● రెండు రోజుల్లో రెండు దుర్మరణం
దుద్యాల్: ప్రతికూల వాతావరణం కారణంగా పశువులు వ్యాధుల బారిన పడుతున్నాయి. స్థానికంగా పశువైద్యులు లేక.. సకాలంలో వైద్య చికిత్స అందక అవి మృత్యువాత పడుతున్నాయి. దీంతో పాడిరైతులు నష్టపోతున్నారు. కేవలం రెండు రోజుల్లో దుద్యాల్ మండల కేంద్రంలో రెండు పశువులు దుర్మరణం చెందాయి. గ్రామానికి చెందిన చిలుముల బాలరాజు, పొల్కంపల్లి రాములుకు చెందిన రెండు జెర్సీ ఆవులకు గాలికుంటు వ్యాధి సోకింది. స్థానికంగా పశు ఆస్పత్రి ఉన్నా.. వైద్యులు లేరు. దీంతో అధిక డబ్బులు వెచ్చించి, ప్రైవేట్ వైద్యులను సంప్రదించినా.. వారు సకాలంలోస్పందించకపోవడంతో మూగజీవాలు చనిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు ఆవులకు కలిపి సుమారు రూ.1.50 లక్షల విలువ ఉంటుందని బాధితులు తెలిపారు. అప్పు చేసి వాటిని కొనుగోలు చేశామని, ఇప్పుడు అవి మృత్యువాత పడి, ఉపాధి కోల్పోయామని చెప్పారు. అప్పు ఎలా తీర్చాలని ఆవేదన చెందుతున్నారు.
వైద్య శిబిరం ఏర్పాటు చేయాలి
మండల కేంద్రం దుద్యాల్‌లో వెంటనే వైద్యశిబిరం ఏర్పాటు చేసి, పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఇవ్వాలని పాడి రైతులు కోరారు. లేని పక్షంలో మరిన్ని పశువుల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతే కాకుండా.. పశువైద్య కేంద్రంలో వైద్యుడిని నియమించాలని కోరుతున్నారు.
టీకా ఇప్పించకపోవడంతోనే..
గాలికుంటు వ్యాధి టీకాలను అందించినప్పుడు, వాటికి ఇప్పించకపోవడంతోనే ప్రస్తుత పరిస్థితి నెలకొందని ఇన్‌చార్జి పశువైద్యురాలు ప్రమీళ తెలిపారు. మందస్తుగా సూది మందు ఇప్పించినట్లయితే ఇలా జరిగుండేది కాదన్నారు.


