న్యూస్‌రీల్
శాసీ్త్రయ పద్ధతుల్లో నిర్వహించాలి
అదే ప్రభుత్వ లక్ష్యం
అనంతగిరి: ఇటీవల బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ దీపక్ తివారిని శుక్రవారం ఎస్పీ స్నేహ మెహ్ర మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో కలిసి మొక్కను బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు.
దౌల్తాబాద్: ఎండతో పాటు నిమ్మకాయ ధర పోటీ పడుతోంది. 20 రోజుల క్రితం వరకు రూ.10కి నాలుగు విక్రయించేవారు. ప్రస్తుతం ఒక్కోటి ధర రూ.8 పలుకుతోంది. ఈ సారి దిగుబడి తగ్గి రవాణా చార్జీలు పెరిగాయి. ఫలితంగా నిమ్మ ధరలకు రెక్కలొచ్చాయి. గతంలో ఒక్కో చెట్టుకు ఐదు నుంచి ఆరు బస్తాల దిగుబడి రాగా.. ఈసారి మారిన వాతావరణ పరిస్థితులు.. వివిధ రకాల వైరస్‌ల కారణంగా కాత, పూత లేక దిగుబడి అనూహ్యంగా పడిపోయింది. పెరిగిన ధరలతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
యాలాల: మండల అభివృద్ధి అధికారి నాగసాయి శ్రీనిజ రెండు నెలల పాటు గ్రూప్ –1 అధికారులకు ఇచ్చే సాధారణ శిక్షణ కార్యక్రమానికి వెళ్లనున్నారు. జూబ్లిహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ఇన్స్‌స్టిట్యూట్‌లో గ్రూప్ –1 అధికారుల రెండో విడత శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఆమె హాజరుకానున్నారు. నవంబరు 22న యాలాల ఎంపీడీఓగా విధుల్లో చేరిన శ్రీనిజ.. పంచాయతీ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా చేపట్టారు. శనివారం నుంచి శిక్షణ కార్యక్రమానికి వెళ్లనుండగా, ఆమె స్థానంలో ఇన్‌చార్జ్ బాధ్యతలు ఇంకా ఎవరికీ కేటాయించలేదు.
వ్యక్తిగత వీడియోలు అప్‌లోడ్ చేశారంటూ మహిళ ఆరోపణ
తాండూరు టౌన్: వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి తమ పరువుకు భంగం కలిగించారని ఓ మహిళ పలువురు యూట్యూబర్లపై కలెక్టర్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. తమ కుటుంబ వ్యవహారంలో జరిగిన వ్యక్తిగత గొడవను వీడియోలు తీసి, మా అనుమతి లేకుండా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారని మున్సిపల్ 7వ వార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ ఇర్షాద్ అహ్మద్ భార్య అతియాబాను ఆరుగురు యూట్యూబర్లపై కలెక్టర్‌తో పాటు ఎస్పీ, తాండూరు డీఎస్పీ, పట్టణ సీఐలకు ఫిర్యాదు చేశారు. పట్టణంలో చెలామణి అవుతున్న నకిలీ రిపోర్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆమె తెలిపారు.
చేవెళ్ల: మహిళలు వంటింటికే పరిమితం కారాదని, అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని చేవెళ్ల అడిషనల్ జిల్లా కోర్టు జడ్జి బృంగి శ్రీనివాస్ అన్నారు. కోర్టు ఆవరణలో శుక్రవారం చేవెళ్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా న్యాయవాదులు, సిబ్బందికి శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలు సమాజ అభివృద్ధిలో భాగం కావాలని సూచించారు. కోర్టు సూపరింటెండెంట్ ఇందిర మాట్లాడుతూ.. ఆడపిల్లలకు విద్యార్థి దశ నుంచే తల్లిదండ్రులు సరైన సహకారం అందిస్తే అన్ని రంగాల్లో రాణిస్తారన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కృష్ణగౌడ్, ముకరం నర్సింలు, ప్రధాన కార్యదర్శి మహేశ్‌గౌడ్, మహిళా న్యాయవాదులు మాధురి, రోజారెడ్డి, ప్రమీణ, పూజ, లోకేశ్వరి పాల్గొన్నారు.
యాక్షన్ ప్లాన్
వికారాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. 99 రోజుల సుదీర్ఘ కార్యాచరణకు అధికారులు శ్రీకారం చుట్టారు. మార్చి 6న ప్రారంభమై జూన్ 9వ తేదీ నాటికి ముగియనుంది. అన్ని ప్రభుత్వ శాఖలు భాగస్వామ్యం కానున్నాయి. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు, ఉద్యోగులు కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 99 రోజుల్లో ఏయే కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై ప్రత్యేక కార్చాచరణ సిద్ధం చేసుకున్నారు. మొదటి రోజు కలెక్టర్ దీపక్ తివారి వికారాబాద్ మున్సిపల్ పరిధిలో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ముఖ్యమైన కార్యక్రమాలు
● 99 రోజుల్లో చేయాల్సిన పనులపై శాఖల వారీగా లక్ష్యాలను ఎంచుకున్నారు. ముందుగా పారిశుద్ధ్య నిర్వహణతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పది రోజుల పాటు రోడ్లు, మురుగు కాలువలను శుభ్రం చేయనున్నారు. వాటర్ ట్యాంకులు క్లీన్ చేయడంతో పాటు బ్లీచింగ్ పౌడర్ చల్లనున్నారు. ముళ్ల పొదలు తొలగిస్తారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, మార్కెట్లు, బస్టాండ్లు, కార్యాలయాల ఆవరణలు శుభ్రం చేయనున్నారు. పాడుబడిన బావులను పూడ్చనున్నారు.
● ఈ నెల 16 నుంచి 31వ తేదీ వరకు ఆదాయ పెంపుదల కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా గ్రామ, మున్సిపాలిటీల్లో కొత్తగా నిర్మించిన ఇళ్లు, పారిశ్రామిక, వ్యాపార సంబంధమైన భవనాల గుర్తింపు, వాటి పన్నుల విశ్లేషణ, పన్నుల డిమాండ్ షీట్ల తయారీ, వంద శాతం వసూలు, అంగన్‌వాడీ, పంచాయతీ భవనాల బలోపేతం, స్వయం సహాయ సంఘాల రుణాలు వసూలు, కొత్త రుణాలు ఇప్పించడం తదితర కార్యక్రమాలు చేపడతారు.
● ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ వరకు తాగునీటి సదుపాయం మెరుగుపర్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. పైప్‌లైన్ లీకేజీలకు మరమ్మతులు, అవసరమైన చోట కొత్తవి ఏర్పాటు చేయడం, నల్లా కనెక్షన్లు ఇవ్వడం, సహజసిద్ధ నీటి వనరుల గుర్తింపు.. వాటి నిర్వహణ, వీటికి జీపీలు, మున్సిపాలిటీల నుంచి నిధులు ఖర్చు చేయడం లాంటి కాార్యక్రమాలు నిర్వహిస్తారు.
● ఏప్రిల్ 16 నుంచి 30వ తేదీ వరకు చెత్త నిర్వహణ కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా చెత్త సేకరణ, తడిపొడి చెత్తను వేరు చేయడం, దాంతో ఎరువుల తయారీ.. తదనంతరం మొక్కలకు వినియోగించడం లాంటివి చేస్తారు.
● మే 1 నుంచి 15వ తేదీ వరకు జాతీయ ఉపాధి హామీ పథకంపై దృష్టి సారించేలా ప్లాన్ చేశారు.
● మే 16 నుంచి 31వ తేదీ వరకు వర్షాకాల సంసిద్ధత కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీటితో పాటు ఆయా శాఖల వారీగా విద్య, వైద్యం, అడవుల సంరక్షణ, వ్యవసాయం దాని అనుబంధ కార్యక్రమాలు చేపడతారు.
● షెడ్యూల్ ప్రకారం జూన్ 9వ తేదీ వరకు మరి కొన్ని కార్యక్రమాలతో ముందుకు సాగనున్నారు.
మొదటి రోజు సాగిందిలా..
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మొదటి రోజు కలెక్టర్ దీపక్ తివారి, మున్సిపల్ అధికారులు వికారాబాద్‌లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. తడిపొడి వేరుచేసే యూనిట్లు, డంపింగ్ యార్డులను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీసు శాఖ కొడంగల్, పరిగి మండలాల్లో డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా 2కే రన్ నిర్వహించారు. ఈగల్ టీం డైరక్టర్ సందీప్ శ్యాండిల్ల, ఎస్పీ స్నేహ మెహ్ర పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత సమాజ ఆవశ్యకత, డ్రగ్స్ దుష్పరిణామాలపై యువతకు అవగాహన కల్పించారు. అయితే మిగతా శాఖలు కార్యక్రమాన్ని మమా అని పించాయి. ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులకు ఇన్‌చార్జ్ మంత్రితో సమావేశం ఉండటంతో వారందరు రంగారెడ్డి కలెక్టరేట్‌కు వెళ్లారు. స్థానికంగా ఉన్న కింది స్థాయి అధికారులు కార్యక్రమాలు చేపట్టారు. ఫొటోలు తీసుకుని అప్‌లోడ్ చేయడం మినహా పెద్దగా కార్యక్రమాలు చేపట్టింది లేదనే చెప్పవచ్చు.
కొడంగల్: డ్రగ్స్, మత్తు పదార్థ్లాను నివారించాలని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. శుక్రవారం కొడంగల్ పట్టణంలో యాంటి డ్రగ్స్ అవేర్‌నెస్ ప్రొగ్రాంలో భాగంగా 2కే రన్ నిర్వహించారు. డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం 2కే రన్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. పిల్లల భద్రత – డ్రగ్స్‌కు అడ్డుకట్ట అనే అంశంపై పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఈగల్ టీమ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య పర్యవేక్షణలో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. విద్యార్థులను మాదక ద్రవ్యాల బారి నుంచి కాపాడుకోవాడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. మహిళలు విద్య, ఉద్యోగం, క్రీడల్లో రాణించి సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా ఈగల్ టీమ్ అదనపు ఎస్పీ కృష్ణమూర్తి, జిల్లా అదనపు ఎస్పీ రాములు నాయక్, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, తహసీల్దార్ రాంబాబు, ఎంపీడీఓ ఉషశ్రీ, ఎంఈఓ రాంరెడ్డి, కమిషనర్ బలరాం నాయక్, కొడంగల్ సీఐ శ్రీధర్‌రెడ్డి, ఎస్‌ఐ సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ప్రారంభం
జూన్ 9వరకు సుదీర్ఘ కార్యాచరణ
అన్ని శాఖల భాగస్వామ్యంతో..
ప్రజాప్రతినిధులతో కలిసి నిర్వహణ
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు..
మొదటి రోజు పారిశుద్ధ్యంపై..
అనంతగిరి: డంపింగ్ యార్డ్ నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని, పర్యావరణానికి హాని కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు ఆదేశించారు. శుక్రవారం ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా వికారాబాద్ పట్టణ పరిధిలోని గంగారం డంపింగ్ యార్డ్‌ను సందర్శించారు. వ్యర్థాల నిర్వహణ విధానం, శుభ్రతపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తడి, పొడి వ్యర్థాలుగా వేరు చేసి ఎరువుల తయారీని వేగవంతం చేయాలన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని డంపింగ్ యార్డ్ పరిసరాలు శుభ్రంగ ఉండేలా చూసుకోవాలని సూచించారు. అనంతరం పట్టణంలో 28వ వార్డులో పర్యటించారు. వార్డు సమస్యలపై మున్సిపల్ అధికారులు, కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సుధీర్, మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి, శానిటేషన్ ఇన్‌చార్జ్ ఏసుదాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలి
ప్రజా సమస్యలు పరిష్కరించాలి
అందుకే ‘ప్రజాపాలన
– ప్రగతి ప్రణాళిక’
ఉమ్మడి జిల్లాల అవగాహన కార్యక్రమంలో స్పీకర్ ప్రసాద్‌కుమార్


