మెగా మహిళా ఆరోగ్య శిబిరం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘ప్రజలకు ప్రభుత్వం, అధికారులు జవాబుదారీతనంగా ఉండాలి. ప్రజలకు సమాధానం చెప్పేందుకే ప్రభుత్వం ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’కు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతోనే 99 రోజుల కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ప్రజా సమస్యల పరిష్కారానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది’ అని శాసనసభా స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మండలి చీఫ్ విప్ పి.మహేందర్‌రెడ్డితో కలిసి ఆయన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. రెండున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ఆరు గ్యారంటీలతో ప్రజలకు అందిన ఫలితాలపై చర్చించాలని, ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాలకు నోచుకోని వారిని ఈ కార్యక్రమంలో భాగంగా గుర్తించి లబ్ధి చేకూర్చాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజా సమస్యలు పరిష్కరించాలన్నారు. సమావేశానికి రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్ కలెక్టర్లు నారాయణరెడ్డి, మను చౌదరి, దీపక్ తివారి, ఫ్యూచర్‌సిటీ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, కాలె యాదయ్య, వ్యవసాయశాఖ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
లబ్ధిదారులను ఇబ్బంది పెట్టొద్దు: దుద్దిళ్ల
ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రభుత్వం 200 యూనిట్ల లోపు వినియోగించిన వాళ్లకు ఉచిత విద్యుత్ పథకాన్ని అందిస్తున్నాం. ఈ జాబితాలో ఇంకెంత మంది అర్హులున్నారో లెక్క తీయాల్సి ఉంది. ఇందిరమ్మ ఇళ్లు బిల్లుల చెల్లింపులో జాప్యం చేయకూ డదు. చిన్నచిన్న సాంకేతిక లోపాలను సాకుగా చూపించి లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేయొ ద్దు. నిరుద్యోగ యువత ఎంత మంది డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు పూర్తి చేశారో లెక్కించాలి. వీరి కోసం జిల్లా స్థాయిలో జాబ్‌మేళా పెట్టి, ఉపాధి అవకాశాలు కల్పించాలి.
ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి: పట్నం
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల పాటు 10 అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించాం. అధికార యంత్రాంగమంతా ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలు పరిష్కరిస్తుంది. ఇప్పటికీ రేషన్ కార్డులు, ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇళ్లను కేటాయించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. అధికారులంతా చక్కగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి. అప్పుడే ఈ కార్యక్రామానికి సార్థకత చేకూరుతుంది.
షెడ్యూల్ రెడీ చేశాం: రంగారెడ్డి కలెక్టర్
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమానికి సంబంధించి షెడ్యూల్ రెడీ చేశాం. నియోజకవర్గానికి ఒక నోడల్ అధికారిని నియమించాం. మొదటి దశలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను క్లియర్ చేయాలని నిర్ణయించాం. పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యత ఇస్తున్నాం. మార్చి 19న ఉగాది రోజు ఏకంగా వెయ్యి ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు చేపట్టాలని నిర్ణయించాం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్క రించుకొని శుక్రవారం రంగారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన మెగా మహిళా ఆరోగ్య శిబిరాన్ని మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. మహిళా ఉద్యోగులు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె.లలితాదేవి పర్యవేక్షించారు.


