తాండూరు రూరల్: మండల పరిధిలోని చంద్రవంచలో ప్రమాదవశాత్తు జొన్న పంట అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు బాధిత రైతు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్వ మల్లేశ్ ఎనిమిది ఎకరాల్లో జొన్న పంట సాగు చేశారు. పంట కోత దశకు వచ్చింది. మధ్నాహ్నం పంటకు నిప్పంటుకోవడంతో గమనించిన స్థానికులు రైతుకు సమాచారం ఇచ్చారు. మంటలార్పేందుకు పలువురు విఫలయత్నం చేశారు. తాండూరు ఫైర్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజన్ వచ్చి మంటాలార్పే వరకు ఆరు ఎకరాల్లో పంటల పూర్తిగా దగ్ధమైంది. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించి ఉంటారని.. సుమారు రూ.3లక్షల నష్టం వాటిల్లిందని ప్రభుత్వమే తనను ఆదుకోవాలని బాధిత రైతు కన్నీటిపర్యంతమయ్యాడు.
భూ తగాదాల్లో ఘర్షణ
● పలువురికి గాయాలు
● ఇరువర్గాలపై కేసులు
పరిగి: మండల పరిధిలోని నస్కల్‌లో మంగళవారం భూ తగాదాలు భగ్గుమన్నాయి. సర్వేనంబర్ 216లో కాసుల వెంకటయ్య కుటుంబ సభ్యుల పేరున మూడెకరాల భూమి ఉంది. ఇదే సర్వేనంబర్‌లో దాయాది కాసుల నగేష్ రోడ్డు వేసేందుకు జేసీబీతో చదును చేస్తుండగా, వెంకటయ్య కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల వారు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలవగా పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వీరి మధ్య కొన్నేళ్లుగా భూతగాదాలు కొనసాగుతున్నాయని సమాచారం. 202, 203 సర్వే నంబర్లలోని పొలాల విషయంలోనూ ఇరు కుటుంబాలు తగాదా పడుతున్నాయని తెలుస్తోంది.
శ్మశానవాటికలో
యువకుడి బలవన్మరణం
మర్రి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య
పరిగి: శ్మశాన వాటికలో ఓ యువకుడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై మోహనకృష్ణ, స్థానికులు తెలిపిన ప్రకారం.. దోమ మండలం మైలారం పంచాయతీ పాశంబండ తండాకు చెందిన కాట్రావత్ దీపక్(23) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వారం క్రితం పట్టణంలో ఉండే అక్క నీల వద్దకు వచ్చి పని చూసుకుంటానని చెప్పాడు. సోమవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి పోయిన దీపక్ ఆర్టీసీ డిపో ఎదుట ఉన్న శ్మశాన వాటికలో మర్రి చెట్టుకుని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా తన కుమారుడి మృతిపై అనుమానం ఉందంటూ తల్లి పారుబాయ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది.
టిప్పర్, కారు ఢీ
ఒకరికి తీవ్ర గాయాలు
చేవెళ్ల: రెండురోజుల్లో పెళ్లి ఉందని స్నేహితులకు పెళ్లికార్డు ఇచ్చేందుకు వచ్చి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న టిప్పర్‌లారీ ఢీకొన్న ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని మీర్జాగూడ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కండ్లపల్లి గ్రామానికి చెందిన బస్వ ప్రవీణ్ నగరంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఈనెల 5న తన వివాహం ఉండటంతో చేవెళ్లలోఉన్న స్నేహితులకు పెళ్లికార్డు ఇచ్చేందుకు మంగళవారం కారులో వచ్చి తిరిగి వెళ్తున్నాడు. మార్గమధ్యలో మీర్జాగూడ సమీపంలోకి రాగానే రోడ్డు పనులకు మట్టిపోస్తున్న టిప్పర్ లారీ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. మరో కారు వెనుక నుంచి వచ్చి వీరి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్ కారులో ఇరుక్కుపోయాడు. అతన్ని స్థానికులు బయటకు తీసి చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కుటుంబసభ్యులు మెరుగైన చికిత్స నిమిత్తం నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


