ఉల్లాసంగా.. ఉత్సాహంగా!
●ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు
●గ్రామాల్లో సర్పంచ్‌ల రాకతో సమస్యల పరిష్కారంపై ఆశలు
●ఈ ఏడాది లక్ష్యాల సాధనపై ప్రజాప్రతినిధుల గురి
నూతన ఏడాది సరి కొత్త పనులకు ప్రణాళిక
వికారాబాద్: నూతన సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. బుధవారం రాత్రి ‘డిసెంబర్ 31’కు ఘనంగా వీడ్కోలు పలికి అంతే ఘనంగా 2026 కొత్త ఏడాదికి స్వాగతం పలకనున్నారు. మొదటి రోజు ప్రముఖ ఆలయాల వద్ద భక్తుల రద్దీ దృష్ట్యా నిర్వాహకులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. జిల్లాలో అధికార పార్టీకి చెందిన నలుగులు ఎమ్మెల్యేలు ఉండగా అందులో ఒకరు సీఎంగా, మరొకరు సభాపతిగా ఉన్నారు. నూతనంగా 594 గ్రామ పంచాయతీలకు సర్పంచులు ఎన్నికై ఇటీవల కొలువుదీరారు. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఆసక్తితో పనులు ప్రారంభిస్తున్నారు. దీంతో తమ సమస్యలు తీరనున్నాయని ఆశగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కొత్త ఏడాది శుభాకాంక్షలతో పాటు నూతన సంవత్సరంలో నిర్వహించబోయే ప్రాధాన్యతా అంశాలను ఉన్నతాధికారులు, స్పీకర్ ‘సాక్షి’తో పంచుకున్నారు.
దేవాలయాల వద్ద ఏర్పాట్లు
కొత్త ఏడాది అంతా మంచే జరగాలని కోరుతూ.. ప్రజలు పెద్ద సంఖ్యలో దేవాలయాలను సందర్శించే అవకాశం ఉండడంతో జిల్లాలోని అన్నిచోట్ల ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా అనంతగిరి అనంత పద్మనాభస్వామి ఆలయం, బుగ్గరామేశ్వర, పీరంపల్లి పరమేశ్వరగుట్ట ఆలయాల వద్ద నిర్వాహకులు అన్ని వసతులు కల్పించారు. పూడూరు మండలంలోని దామగుండం రామలింగేశ్వర స్వామి ఆలయం, కుల్కచర్ల మండలంలోని పాంబండ దేవాలయం, దోమలోని మైలారం వేంకటేశ్వర ఆలయం, పరిగిలోని వేంకటేశ్వర, నర్సింహాస్వామి, శివాలయం, పరిగి మండల పరిధిలోని లొంకహనుమాన్ దేవాలయం, కొడంగల్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయం, పోలెపల్లి ఎల్లమ్మ ఆలయం, తాండూరు నియోజకవర్గ పరిధిలోని భూకై లాస్, నీల్లపల్లి శివాలయం, నవాబుపేట మండలం ఎల్లకొండ శివాలయం తదితర ఆలయాలు మొదటి రోజున భక్తులతో కిటకిటలాడనున్నాయి.
కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి. గతేడాది విజయాలు, లోటుపాట్లను సరిదిద్దుకొని ఈ 2026 సంవత్సరం ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలి. ఉమ్మడి జిల్లాలోని రైతులు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు ప్రగతి పథంలో ముందుకు సాగాలి. ఉమ్మడి జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
– పట్నం మహేందర్‌రెడ్డి, మండలి చీఫ్ విప్
ముందుగా జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడిచిన ఏడాదిలో ఎప్పుడు లేనివిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. కోట్‌పల్లి ప్రాజెక్టు, అనంతగిరి అభివృద్ధి పనులు పూర్తి చేయటం, మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయించడం వంటి పనులకు ప్రాధాన్యతనిస్తాం. ఆరు గ్యారంటీలతో పాటు ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తాం.
– గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనసభాపతి
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రభుత్వ ప్రాథమ్యాలను ముందుకు తీసుకెళ్తాం. ఆరు గ్యారంటీలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తాం. యంత్రాంగానికి తగు సూచనలు చేసి సమర్థవంతంగా అమలయ్యేలా చూస్తాం. కొత్త ఏడాదిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ పాలనాపరంగా, ప్రభుత్వ తరఫున అవసరమైన సేవలు అందించేందుకు కృషి చేస్తాం. అందరి సహకారంతో జీపీ ఎన్నికలు సాఫీగా నిర్వహించాం.
– ప్రతీక్‌జైన్, కలెక్టర్
జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రధానంగా ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ముందుకు సాగుతాం. చట్టాన్ని గౌరవించే వారిని పోలీసులు ఎప్పుడు గౌరవిస్తారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం. ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. వీటిపై అవగాహన కల్పిస్తున్నాం. పోలీసుల పరంగా ప్రజలకు ఏ అవసరాలు ఉంటాయో వాటిని నెరవేరుస్తాం.
– స్నేహమెహ్ర, ఎస్పీ
పరిగి ప్రాంత ప్రజలకు సాగు నీరు అందించే లక్ష్యంగా పని చేస్తా. కొత్త సంవత్సరంలో కేపీ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు పనుల్లో భాగంగా భూ సేకరణ ప్రారంభిస్తాం. పరిగి నుంచి షాద్‌నగర్, వికారాబాద్ వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసేలా కృషి చేస్తా. నియోజకవర్గ ప్రజలకు ఉపాధి కల్పించే లక్ష్యంగా ఏటీసీ సెంటర్‌ను ప్రారంభిస్తాం.
– రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే, పరిగి
నియోజకవర్గంలో సాగు, తాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తా. కొత్త ఏడాదిలో ప్రజలందరూ ఆర్థికంగా ఎదగాలి. కోట్‌పల్లి ప్రాజెక్టు అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. అసంపూర్తిగా నిలిచిపోయిన బైపాస్ రోడ్డు పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా. వాటర్ ట్యాంక్‌లను వేగంగా పూర్తి చేయించడంతో పాటు పాత తాండూరులోని కాగ్నా నది పంప్‌హౌస్ అభివృద్ధి కోసం కృషి చేస్తా. గ్రామాల్లో నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటా. – మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్యే, తాండూరు


