పుణ్యక్షేత్రమైన పులిలొంక!
మోమిన్‌పేట: ఒకప్పుడు పులులు సంచరించే ప్రాంతం.. ప్రస్తుతం ఆధ్యాత్మిక క్షేత్రమై విరాజిల్లుతోంది. 60ఏళ్ల క్రితం వరకు ఇక్కడ దట్టమైన అటవీ ప్రాంతం ఉండేది. ఓ మేకల కాపరి, నిత్యం తన మేకలను మేత కోసం అడవికి తీసుకెళ్లేవాడు. ఈక్రమంలో 20 ఏళ్ల పాటు ఒంటరిగా శ్రమించి ఓ గుట్టను గుహగా మలిచాడు. సుమారు 20 మీటర్ల పొడవు, 4మీటర్ల వెడల్పుతో గుహను తీర్చిదిద్ది లోపల వేంకటేశ్వరస్వామి విగ్రహం, గుహ ప్రారంభంలో లక్ష్మీనారసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. దీంతో పులి లొంక.. పుణ్యక్షేత్రమైంది. మేకల కాపరి పర్మయ్య.. పరమదాసుగా మారాడు. చుట్టూ ఎతైన గుట్టలు, దట్టమైన అడవి, ఆహ్లాదమైన ప్రదేశం, పచ్చని చెట్లు, చల్లని గాలులతో ఇక్కడి వాతావరణం భక్తుల మనసులను కట్టిపడేస్తోంది. ఆలయ ప్రాంగణంలో ఆంజనేయస్వామి గుడి, శివాలయం, గుహలో వేంకటేశ్వరస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు.
మార్గం ఇలా..
హైదరాబాద్ నుంచి 68 కిలోమీటర్లు, మోమిన్‌పేటకు 9కిలో మీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. వికారాబాద్ నుంచి సదాశివపేట వెళ్లే మార్గంలో, వెల్‌చాల్ బస్టాండు వద్ద బస్సు దిగి, 2కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి ఆటోల్లో చేరుకోవచ్చు. ప్రతీ 20 నిమిషాలకు ఓ బస్సు ఉంటుంది. వికారాబాద్, జహీరాబాద్ నుంచి రైలు సదుపాయం ఉంది. వెల్‌చాల్ సమీపంలో సదాశివపేట రోడ్డు స్టేషన్‌లో రైలు దిగితే ఆటోలో వెళ్లవచ్చు.
పుణ్యక్షేత్రమైన పులిలొంక!


