ప్రత్యర్థుల నుంచి కాపాడబోయి..
తన దుకాణంలో దాక్కున్న వ్యక్తిని ప్రత్యర్థుల నుంచి కాపాడబోయిన వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన తాండూరు పట్టణ శివారులో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
తాండూరు/యాలాల: తాండూరు పట్టణ శివారు.. యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ కాలనీలో గురువారం రాత్రి వృద్ధుడి హత్య ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. నియోజకవర్గంలో వారం రోజుల వ్యవధిలో హత్య, హత్యాయత్నం ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కోట్‌పల్లిలో సర్పంచ్ బసమ్మ భర్త సంగయ్యపై హత్యాయత్నం ఘటన నుంచి తెరుకోకముందే తాండూరులో వృద్ధుడు హత్యకు గురికావడం కలవర పెడుతోంది. మరోవైపు పాత తాండూరులో అల్లరి మూకలు రాళ్లు రువ్వారు. విషయం తెలుసుకున్న జోగులాంబ జోన్ డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్, వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర తాండూరుకు చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు ఇక్కడే మకాం వేశారు.
దాడిని అడ్డుకునేందుకు వెళ్లి..
పాత కక్షల నేపథ్యంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన వృద్ధుడు హత్యకు గురైనట్లు జోగులాంబ జోన్ డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ తెలిపారు. శుక్రవారం తాండూరులో ఎస్పీ స్నేహ మెహ్రతో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. తాండూరు మండలం ఖాంజాపూర్‌కు చెందిన గోపాల్, కిట్టు మధ్య కొంత కాలంగా పాత కక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో గోపాల్ మరో 5 మందితో కలిసి గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో కిట్టుపై దాడికి యత్నించాడు. అప్రమత్తమైన కిట్టు అక్కడి నుంచి తప్పించుకొని రాజీవ్ కాలనీలోని ఓ బీఫ్ షాపులోకి వెళ్లి షెట్టర్ వేసుకొని దాక్కున్నాడు. గోపాల్ అతని అనుచరులు షెట్టర్‌ను పగులగొట్టే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న బీఫ్ షాపు యాజమాని నూర్ మహ్మద్, అతని కుమారుడు సుఫియాన్ ఖురేషి వారిని అడ్డుకున్నారు. దీంతో గోపాల్ ఆగ్రహంతో రగిలిపోయిన తండ్రి, కొడుకులపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన నూర్ మహ్మద్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రక్తపు మడుగులో ఉన్న నూర్ మహ్మద్‌ను, గాయపడిన షుఫియాన్‌ను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నూర్ మహ్మద్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. నగరానికి వెళ్తున్న క్రమంలో మరణించారు. కిట్టును కాపాడబోయి నూర్ మహ్మద్ హత్యకు గురైనట్లు డీఐజీ తెలిపారు. పట్టణంలో ఎలాంటి ఘటనలు చోటుచేఐసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పోలీస్ పికెటింగ్
తాండూరు రూరల్: వృద్ధుడి హత్య నేపథ్యంలో ప్రధాన నిందితుడు గోపాల్ స్వగ్రామం ఖాంజాపూర్‌లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. గురువారం గోపాల్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గ్రామంలో 20 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
హత్యకు గురైన వృద్ధుడు
తాండూరు పట్టణ శివారులో ఘటన
రాళ్లు రువ్విన అల్లరి మూకలు
హుటాహుటిన ఘటనా స్థలానికిచేరుకున్న డీఐజీ, ఎస్పీ
కేసు వివరాల వెల్లడి
ప్రత్యర్థుల నుంచి కాపాడబోయి..


