శంషాబాద్ జోన్‌లోకి ఆదిబట్ల
● 17డివిజన్లతోసర్కిల్ కేంద్రంగా ఏర్పాటు
● హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
ఇబ్రహీంపట్నం రూరల్: శివారు మున్సిపాలిటీలను ప్రభుత్వం గ్రేటర్‌లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. మొదటగా చార్మినార్ జోన్‌లోకి ఆదిబట్లను కలుపుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఔటర్‌రింగ్‌రోడ్డుకు ఆనుకొని ఉన్న మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో కలుపుతూ తీసుకున్న నిర్ణయంపై నిన్నటి వరకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. గతంలో 150 కార్పొరేటర్ సిట్లు ఉన్న జీహెచ్‌ఎంసీ ప్రస్తుతం 300లకు పెంచింది. అందులో భాగంగానే ఆదిబట్ల మున్సిపాలిటీని సైతం రెండు వార్డులుగా విభజించింది.
అభిప్రాయ సేకరణ పూర్తి
ఆదిబట్ల మున్సిపాలిటీ గతంలో ఎంపీ పటేల్‌గూడ, మంగళ్‌పల్లి, బొంగ్లూర్, రాందాస్‌పల్లి, కొంగరకలాన్, ఆదిబట్ల, మంగళ్‌పల్లి ప్రాంతాలను కలిపి ఆదిబట్ల మున్సిపాలిటీగా చేశారు. ప్రస్తుతం గ్రేటర్‌లో ఆదిబట్ల మున్సిపాలిటీని విలీనం చేయడంతో 54 డివిజన్‌గా కొంగరకలాన్, 55వ డివిజన్‌గా ఆదిబట్లను ప్రకటించారు. అభిప్రాయ సేకరణ చేసినప్పటికీ ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో రెండు డివిజన్లను ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
శంషాబాద్ జోన్‌లో ఆదిబట్ల సర్కిల్
ఆదిబట్ల మున్సిపాలిటీ మొదటగా చార్మినార్ జోన్‌లో కలుపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా అభ్యంతరాలు వెలువడడంతో ప్రస్తుతం ఆ నిర్ణయం వెనక్కి తీసుకొని శంషాబాద్ జోన్‌లోకి విలీనం చేశారు. ప్రస్తుతం శంషాబాద్‌లో ఆదిబట్ల, బడంగ్‌పేట్, జల్‌పల్లి, శంషాబాద్ నాలుగు సర్కిల్స్ ఉన్నాయి. ఇందులో తొర్రూర్, కొంగరకలాన్, ఆదిబట్ల, తుర్కయంజాల్, నాదర్‌గుల్, ప్రశాంతిహిల్స్, జిల్లెలగూడ, మీర్‌పేట్, బాలాపూర్, షాహీన్‌నగర్, పహాడీషరీఫ్, జల్‌పల్లి, తుక్కుగూడ, మంఖాల్, శంషాబాద్, కొత్వాల్‌గూడ డివిజన్లను కలిపింది. నాలుగు సర్కిల్‌లు ఇందులో ఉండగా తొర్రూర్, కొంగరకలాన్, ఆదిబట్ల, తుర్కయంజాల్ డివిజన్లను కలుపుతూ ఆదిబట్ల సర్కిల్‌గా ఏర్పాటు చేయనుంది.
పరిపాలన సౌలభ్యం
పట్టణ ప్రజలకు సేవలందించడానికి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టరేట్ కార్యాలయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆదిబట్లను సర్కిల్ కేంద్రంగా ఏర్పాటు చేసింది. డివిజన్ 53 తొర్రూర్, 54 కొంగరకలాన్, 55 ఆదిబట్ల, 56 తుర్కయంజాల్‌లను కలుపుతూ ఆదిబట్ల సర్కిల్‌గా చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఆదిబట్ల మున్సిపాలిటీ కార్యాలయం లేదా , ఔటర్ పరిసర ప్రాంతాల్లో కొత్త సర్కిల్ కార్యాలయం ఏర్పాటు కానుందని అధికార వర్గాల సమాచారం.


