ముగ్గురు దొంగలకు రిమాండ్
ఇబ్రహీంపట్నం రూరల్: ఇళ్ల తాళాలు పగులకొట్టి దోపిడీకి పాల్పడుతున్న ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఆదిబట్ల సీఐ రవికుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ఆదిబట్ల ఠాణా పరిధిలోని బొంగ్లూర్ సమీపంలోని రాఘవేంద్ర హోమ్స్‌లో నవంబర్ 26న అమనగంటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులు నగరంలోని వారి బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లి వచ్చేలోపు కిచెన్ తలుపు పగలగొట్టి బంగారం, నగదు, ల్యాప్‌టాప్, స్మార్ట్ వాచ్‌లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మీర్‌పేట్‌లో నివాసం ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లా నంద్యాలకు చెందిన డెలివరీ బాయ్ దస్తార్ బ్యాండ్ షఫీ, అలియాస్ షఫీ(42), ఖమ్మగూడలోని సుభాష్‌నగర్‌లో ఉండే నల్గొండ జిల్లా, కట్టంగూర్ మండలం ఎర్సానిగూడెంకు చెందిన డ్రైవర్ ఉబ్బాని యోగేశ్వర్ అలియాస్ యోగి(23), పశ్చిమగోదావరి జిల్లా నర్సపూర్ మండలం పెరుపాలెంకు చెందిన రాజేశ్ అలియాస్ చిన్నా (24) చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. వీరిని విచారించగా నేరం అంగీకరించారు. రెండు నెలల క్రితం బెయిల్‌పై వచ్చిన వీరిపై ఆదిబట్ల పీఎస్‌లో ఏడు కేసులు, ఇబ్రహీంపట్నం ఠాణాలో ఒక కేసు, నిజామాబాద్‌టౌన్‌లో బైక్ చోరీ, శంషాబాద్ ఆర్‌జీఐ ఎయిర్‌పోర్టు సమీపంలో మరో మోటార్‌సైకిల్ దొంగతనం చేసిన కేసుల్లో పట్టబడ్డారు. వీరి వద్ద నుంచి 4.5 గ్రాముల బంగారు ఆభరణాలు, ఆపిల్ ఐపాడ్, ఆపిల్ స్మార్ట్‌వాచ్, మూడు ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్, హీరో ఐస్మార్ట్ బైక్, హోండా షైన్ బైక్‌తో పాటు రూ.10వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ట్రాక్టర్ బ్యాటరీల దొంగలకు..
నందిగామ: ట్రాక్టర్ బ్యాటరీలు చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన రోహిత్‌కుమార్, మధ్యప్రదేశ్‌కు చెందిన శివం సింగ్ మిత్రులు. వీరు కొత్తూరు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరు ఇటీవల అప్పారెడ్డిగూడ, నర్సప్పగూడ గ్రామాల్లో ట్రాక్టర్ల నుంచి 11 బ్యాటరీలు దొంగిలించారు. వీటిని శుక్రవారం కొత్తూరులో విక్రయించడానికి వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వారు నేరం అంగీకరించారు.
బంగారు ఆభరణాలు, రెండు బైక్‌లు స్వాధీనం


