వలస ఓటర్లే టార్గెట్!
వికారాబాద్: ఏ ఫోన్ మోగినా ఎన్నికల చర్చే జరుగుతోంది. ఓ పక్క కాల్ రికార్డు చేసి పక్క వాళ్లకు వినిపిస్తారేమోననే భయం ఉన్నా తప్పని సరి పరిస్థితిల్లో చర్చలు.. సంప్రదింపులు జరుపుతున్నారు. అన్ని కార్యక్రమాలు మొబైల్స్ ద్వారానే చక్కదిద్దుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఫోన్ లేనిదే ఏ పని చేయలేని పరిస్థితులు తలత్తాయని చెప్పవచ్చు. ఏ కాల్ వచ్చినా ఎన్నికల గురించే మాట్లాడుతున్నారు. మొదటి, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎక్కడాలేని బంధుత్వాలు, ప్రేమ కనబరుస్తున్నారు. ఓటరు జాబితా చేతపట్టుకొని వారి ఫోన్ నంబర్లు సేకరించేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసుకున్నారు. అభ్యర్థులు తమకు బాగా కావాల్సిన, నమ్మకస్తులను ఎంచుకొని వారి ఖాతాల్లో డబ్బులు వేసి ఎన్నికల ఖర్చు, లావాదేవీలు మొత్తం ఫోన్‌ల ద్వారానే జరుపుతున్నారు.
జిల్లాలో వలస జీవులు అధికంగా ఉన్నారు. పరిగి నియోజకవర్గం పరిధిలోని కుల్కచర్ల, దోమ మండలాలకు చెందిన వేలాది మంది కూలీలు పూణే, ముంబై పట్టణాల్లో జీవనం సాగిస్తున్నారు. కొడంగల్, తాండూరు నియోజకవర్గాలకు చెందిన వారు కూడా ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. ఒక్కో మండలం నుంచి సగటున 1,000 నుంచి 3,000 మంది ఓటర్లు దూర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వారి ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి. దీన్ని గుర్తించిన అభ్యర్థులు వారిని రప్పించే పనిలో పడ్డారు. ఫోన్లు చేసి ఆప్యాయంగా, ప్రేమగా పలకరిస్తున్నారు. బంధుత్వాలను గుర్తు చేస్తున్నారు. బస్ టికెట్లు బుక్ చేస్తాం వచ్చి ఓట్లు వేసి పోవాలని కోరుతున్నారు. అభ్యర్థులు వారి తరఫున ఎవరో ఒకరిని ముంబై, పూణే పట్టణాలకు పంపుతున్నారు. అక్కడ వలస జీవులను కలిసి పోలింగ్ రోజు వచ్చేందుకు బస్సు చార్జీలు ఇచ్చి వస్తున్నారు. వచ్చాక మరిన్ని డబ్బులు ఇస్తామని.. తమకే ఓటు వేయాలని మాట తీసుకుంటున్నట్లు సమాచారం. ఫ్రీగా ఊరికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసే అవకాశం వస్తుండటంతో వలస జీవులు కూడా ఆసక్తి చూపుతున్నారు.
వాట్సాప్ గ్రూపుల్లో..
ఈ ఎన్నికల్లో మొబైల్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. వాట్సాప్ గ్రూపులు మిరింత కీలకంగా మారాయి. సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు వారు గెలిసే ఏం చేయాలనుకుంటున్నారో పూర్తి వివరాలను తయారు చేసి వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సాధారణ ఓటర్లను మొదలుకుని యువజన సంఘాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాలనీల్లో నెలకొన్న సమస్యలను గుర్తు చేసి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీలు ఇస్తున్నారు. గతంలో సర్పంచ్‌లుగా, ఎంపీటీసీ సభ్యులుగా, ఉప సర్పంచులుగా పని చేసిన వారు వారి హయాంలో చేసిన అభివృద్ధి పనులను షేర్ చేస్తున్నారు. ఈ సారి గెలిపిస్తే కాలనీలను మరింత అభివృద్ధి చేస్తామని పోస్టులు పెడుతున్నారు. మరో పక్క విందులు, పార్టీలు చేసుకునేందుకు, మద్యానికి, భోజనాలకు ఆన్‌లైన్ ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారు. ఐదారుగురు ఓచోట చేరి అభ్యర్థికి ఫోన్ చేసి మామా ఈడికి మందు పంపు.. మా ఇంట్లో మరో పది ఓట్లు ఉన్నాయి. వెంటనే డబ్బు పంపమని అడుగుతున్నారు. మరో పక్క అలిగిన వారిని కూడా ఫోన్ల ద్వారానే బుజ్జగిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో వలస ఓటర్లే కీలకం కానున్నారు. జిల్లాకు చెందిన వేల మంది కూలీలు ఆయా నగరాల్లో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పోలింగ్ రోజు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు అవరమైన బస్సు చార్జీలు, ఇతర ఖర్చులు భరించేందుకు సిద్ధమయ్యారు. అంతేకాకుండా తమకే ఓటు వేసేలా మాట కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.
ఓట్ల పండుగకు రావాలే
ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు
ఫోన్లు చేసి ఆప్యాయంగా పలకరిస్తున్న వైనం
బంధుత్వాలను గుర్తు చేస్తున్న క్యాండెట్లు
ఊరికి వచ్చి ఓటేసి పోవాలని అభ్యర్థన
బస్ చార్జీలు, ఇతర ఖర్చులు తామే చూసుకుంటామని హామీ