ఘనంగా శ్రీనివాస కల్యాణం
కొడంగల్: పట్టణంలో శ్రీనివాస కల్యాణాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణ పురోహితులు కిట్టు స్వామి, లక్ష్మీనారాయణ జోషిల ఆధ్వర్యంలో అభిషేకం, కల్యాణోత్సవం, హోమం తదితర పూజా కార్యక్రమాలు చేశారు. పట్టణానికి చెందిన కటుకం వెంకటేశ్, మమత దంపతుల ఆధ్వర్యంలో పూజలు జరిపించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, పీఏసీఎస్ చైర్మన్ శివకుమార్ గుప్తా, లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు మురహరి వశిష్ట, బాధ్యత సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.
వైభవంగా అయ్యప్పస్వామి శోభాయాత్ర
తాండూరు: అయ్యప్పస్వామి దేవాలయ వార్షికోత్సవాలు గురువారం అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం స్వామివారి విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాన్ని రథంపై ప్రతిష్ఠించి పట్టణ వీధుల గుండా శోభాయాత్ర చేపట్టారు. వందలాది మంది భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి శోభాయాత్రలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి పల్లకీ సేవ భావిగి భద్రేశ్వర దేవాలయం వరకు కొనసాగింది. ఆలయంలో అయప్ప స్వాములకు పట్టణానికి చెందిన భక్తులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ స్వప్నపరిమళ్, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
బెల్టు షాపులపై కొరడా!
● ఒకేరోజు మూడు గ్రామాల్లో దాడులు
● ముగ్గురిపై కేసు నమోదు
తాండూరు రూరల్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు బెల్టు షాపులపై కొరడా ఝుళిపించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం మూడు గ్రామాల్లో బెల్టు షాపులపై కరన్‌కోట్ పోలీసులు దాడులు నిర్వహించారు. చెన్‌గేస్‌పూర్, గోపన్‌పల్లి, ఎల్మకన్నె గ్రామాల్లో కిరాణ దుకాణంలో తనిఖీలు చేశారు. అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తుండగా పట్టుకున్నారు. షాపుల్లో ఉన్న 20 లీటర్ల లిక్కర్ బీర్లను స్వాధీనం చేసుకున్నారు. కుర్వ భాగ్యమ్మ, గౌడి సుజాత, కుర్వ మల్లప్పలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో కేసులు నమోదు అయితే భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు.
సమతుల ఆహారంతోనే ఆరోగ్యం
పీహెచ్‌సీ డాక్టర్ శాంతి
ధారూరు: ప్రతిఒక్కరూ సమతుల ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారని ధారూరు పీహెచ్‌సీ వైద్యురాలు శాంతి పేర్కొన్నారు. వ్యాధుల బారిన పడినప్పుడు వైద్యుల సలహా మేరకు నడుచుకోవాలని సూచించారు. గురువారం టీబీ ముక్త్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాధిగ్రస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, మనం తినే ఆహార అలవాట్ల ద్వారా పలు రకాల వ్యాధులు వస్తున్నాయన్నారు. పౌష్టికాహారంతో వాటిని నియంత్రించుకోవచ్చని చెప్పారు.
ఘనంగా శ్రీనివాస కల్యాణం
ఘనంగా శ్రీనివాస కల్యాణం


