24 రోజులుగా టోకెన్లు లేవు
● గట్టెపల్లిలో నిలిచిన ధాన్యం విక్రయాలు
● ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
ధారూరు: పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో 24 రోజుల నుంచి ఒక్క బస్తా వడ్లు కొనడం లేదని మండలంలోని గట్టెపల్లి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. తేమశాతం 17 వరకు రావాలని ఎండబెట్టి రాత్రి వేళల్లో పాలిథిన్ కవర్లు కప్పి కాపాడుకుంటున్నామన్నారు. ఇంతవరకు టోకెన్లు ఇవ్వకపోవడంతో కొనుగోలు కేంద్రానికి ధాన్యం సంచులు తీసుకు రాలేకపోయామన్నారు. ఏఈఓకు ఫోన్ చేస్తే స్పందించరని, ఎక్కడైన కనబడి తే ఇస్తాంలే అంటూ వెళుతున్నారని వాపోయారు. ప్రస్తుతం ఏ పొలం వద్ద చూసినా నిల్వ చేసిన వడ్లు దర్శనమిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం టోకెన్ల జారీ
వరి కొనుగోలు కేంద్రం చేసినప్పటి నుంచి వడ్లు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని హరిదాస్‌పల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సీఈఓ రవికుమార్ పేర్కొన్నారు. రైతులకు కావాల్సిన గన్ని బ్యాగులు సైతం సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. టోకెన్ల పుస్తకం రాకపోవడంతో జాప్యం జరిగిందని, ప్రస్తుతం టోకెన్లు జారీ చేస్తున్నామని ఏఈఓ సంతోష్ వివరణ ఇచ్చారు.


