వంతెన నిర్మాణం.. సాకారం
● జేపీదర్గా కూడలిలో తగ్గనున్న ప్రమాదాలు
● ఫ్లైవర్ నిర్మాణానికి శ్రీకారం
● హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు
కొత్తూరు: రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా నూతన వంతెనల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. పట్టణంలోని జాతీయ రహదారిపై జేపీ దర్గా కూడలి వద్ద ప్రయాణికులు ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇన్ముల్‌నర్వ గ్రామంలో ఉన్న ప్రఖ్యాతిగాంచిన జేపీ దర్గా, అంతేకాకుండా పీఅండ్‌జీ, నాట్కో ఇతర పరిశ్రమలకు వెళ్లాలంటే తప్పకుండా కూడలి దాటాల్సిందే. జాతీయ రహదారి కావడంతో వాహనాలు అతి వేగంగా ప్రయాణిస్తుంటాయి. కాగా ఇక్కడ కూడలి దాటాలంటే వాహనదారులకు ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పటికే పలుమార్లు ప్రమాదాలకు గురై కార్మికులు, దర్గా దర్శనం కోసం వచ్చే భక్తులు పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. కూడలిలో వరుసగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలను నివారించాలని స్థానికులు, పోలీసులు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు విన్నవించారు. దీంతో ఎట్టకేలకు కూడలి వద్ద వీయూపీ(వెహికల్ అండర్ పాస్) నిర్మాణానికి ఆమోద ముద్ర పడింది.
రూ.35 కోట్లతో నిర్మాణం
జేపీ దర్గా కూడలిలో ప్రమాదాల నివారణకు సుమారు రూ.35 కోట్లతో ఒకటిన్నర కిలోమీటర్ పొడవుతో భారీ ఫ్లైఓవర్‌ను నిర్మించనున్నారు. ఇప్పటికే వంతెన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వంతెన నిర్మించే స్థలంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించారు. నిర్మాణం పూర్తయితే కూడలి వద్ద సాధ్యమైనంత వరకు ప్రమాదాలు తగ్గిపోనున్నాయి. అంతేకాకుండా హైదరాబాద్ నుంచి షాద్‌నగర్ వైపునకు వెళ్లే భారీ వాహనాలు వంతెన కింద నుంచి యూటర్న్ తీసుకొని తిరిగి పాత జాతీయ రహదారి మీదకు చేరుకునే విధంగా భారీ వెడల్పుతో వంతెన నిర్మాణాన్ని చేపట్టనున్నారు.
ప్రయోజనాలు ఇవే..
● వంతెన నిర్మాణంతో ప్రమాదాలు తగ్గడంతో పాటు ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనాలు రాకపోకలు కొనసాగిస్తాయి.
● ఇప్పటికే వై జంక్షన్ కూడలి సమీపంలో నిర్మించిన అండర్‌పాస్ డిజైన్ లోపం కారణంగా వర్షాకాలంలో వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయి.
● హైదరాబాద్ నుంచి షాద్‌నగర్ వైపునకు వెళ్లే ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు దర్గా కూడలిలో నిర్మించే వంతెన కింది నుంచి యూటర్న్ తీసుకొని వై జంక్షన్ సమీపం నుంచి పాత జాతీయ రహదారిపైకి చేరుకుంటాయి.
ప్రమాదాల నివారణ
జాతీయ రహదారిపై ఆయా కూడళ్ల వద్ద తరచూ జరుగుతున్న ప్రమాదాలను ఇప్పటికే ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారు స్పందించి జేపీదర్గా కూడలి, నందిగామ మండలంలో మేకగూడ కూడలి, కేశంపేట్ రోడ్డులో చటాన్‌పల్లి కూడలి, బూర్గుల వద్ద రాయికల్ కూడలిలో భారీ వంతెనల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నిర్మాణం పూర్తయితే ప్రమాదాలు తగ్గుతాయి.
– వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్యే, షాద్‌నగర్


