
ఆగిన ప్లాన్
అమృత్ 2.0 పథకం కిందపది నెలల క్రితం సర్వే వికారాబాద్, తాండూరుపురపాలికల ఎంపిక డ్రోన్ సాయంతో ‘డిజిటల్’కు రూపకల్పన 40 సంవత్సరాల పాటుఉపయోగపడేలా కార్యాచరణ ముందుకు సాగని ప్రక్రియ
మున్సిపాలిటీల మాస్టర్ ప్లాన్ తయారీ ప్రారంభానికే పరిమితం
వికారాబాద్: మున్సిపాలిటీల మాస్టర్ ప్లాన్ సర్వే ప్రారంభానికే పరిమితమైంది. పది నెలల క్రితం ప్రక్రియ చేపట్టినా నేటికీ పూర్తి కాలేదు. రాష్ట్రంలో మన జిల్లా నుంచే డిజిటల్ ప్లాన్‌కు రూపకల్పన చేశారు. అయితే అధికారుల వద్ద సర్వే ఎంత వరకు వచ్చిందనే సమాచారం లేకపోవడం గమనార్హం. మాస్టర్ ప్లాన్ తయారీకి ప్రభుత్వం డ్రోన్లను వినియోగించింది. 30 నుంచి 40 సంవత్సరాల వరకు ఉపయోగపడేలా డిజిటల్ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 50 వేలకు పైగా జనాభా ఉన్న పురపాలికల్లో సర్వే చేయాలని భావించారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉండగా వికారాబాద్, తాండూరును ఎంపిక చేశారు. సర్వే ఆఫ్ ఇండియా వారు ముందుగా వికారాబాద్‌లో ఆ తర్వాత తాండూరులో సర్వే ప్రక్రియను ప్రారంభించారు. తాండూరులో విద్యుత్ తీగలు డ్రోన్‌కు తగిలి అది పేలిపోయింది. అంతటితో ప్రక్రియ ఆగిపోయింది.
భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా..
భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా డిజిటల్ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. మున్సిపాలిటీల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలన్నా.. మౌలిక సదుపాయాలుకల్పించాలన్నా.. నిర్మాణాలు చేయాలన్నా ఈ మాస్టర్ ప్లాన్ ఉపయోగపడేలా తయారు చేయాలని నిర్ణయించారు. మున్సిపాలిటీ ఉపరితం ఎత్తు, చెరువులు, వాగులు, డ్రైనేజీలు, ఇళ్లు, చెట్లు,రోడ్లు, వైకుంఠధామాలు, ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, భవన సముదాయాలు, మార్కెట్లు, సెల్ టవర్లు, టాయిలెట్లు, వాటర్ ట్యాంకులు, రిజర్వాయర్లు తదితర వనరులన్నింటినీ మ్యాపింగ్ చేస్తారు. అనంతరం మ్యాపుల ఆధారంగా 40 సంవత్సరాల అవసరాలకు తగ్గట్టుగా మాస్టర్ ప్లాన్ తయారు చేసి మున్సిపాలిటీలకు అందజేస్తారు. భవిష్యత్ తరాలకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.
విడతల వారీగా..
కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా మున్సిపాలిటీలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తాండూరుకు రూ.27 కోట్లు, పరిగికి రూ.15.5 కోట్లు, వికారాబాద్‌కు రూ.12 కోట్లు, కొడంగల్‌కు రూ.4.5 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను వాటర్ సప్లయ్, తాగు నీటి వనరుల అభివృద్ధి కోసం వినియోగిస్తున్నారు. ప్రస్తుతం తయారు చేస్తున్న మాస్టర్ ప్లాన్ ఆధారంగా భవిష్యత్తులో నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వనరులు, మార్కెట్లు, డంపింగ్ యార్డులు తదితర వాటికి ఈ ప్లానే ఆధారం కానుంది.