
విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించం
తాండూరు రూరల్: విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ సదానందం హెచ్చరించారు. శనివారం తాండూరులోని ఏడీఏ కార్యాలయాన్ని సందర్శించారు. సబ్ సెంటర్ డాక్టర్లు, కాంపౌండర్లు, గోపాలమిత్రలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో సిబ్బంది కొరత ఉన్నా సర్దుబాటు చేసి పశువులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. 34 డాక్టర్ పోస్టులకు గాను 10 ఖాళీగా ఉన్నాయన్నారు. 60 సబ్ సెంటర్లలో 35 కాంపౌండర్ పోస్టులు భర్తీ కాగా 25 ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. విధులకు సక్రమంగా హాజరుకాని తాండూరు ఇన్‌చార్జ్ ఏడీఏపై చర్యలు తీసుకుంటామన్నారు.ఽ ధారూరు మండలం కుక్కింద సబ్ సెంటర్ కాంపౌండర్‌ను ఏడీఏ కార్యాలయానికి డిప్యూటేషన్ వేసినట్లు తెలిపారు. పశువులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా టీకాలు వేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అనంతరం కార్యాలయ రికార్డులను పరిశీలించారు.
జీతాలు ఇప్పించండి సారూ..
ఐదు నెలలుగా జీతాలు రాక అవస్థలు పడుతున్నామని గోపాలమిత్రలు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ సదానందం కోరారు. జిల్లాలో 56 మంది గోపాలమిత్రలు పని చేస్తున్నారని, ప్రతి నెలా జీతం అందేలా చూడాలని విన్నవించారు.