
శాంతిభద్రతల్లో రాజీపడం
అనంతగిరి: శాంతిభద్రతల విషయంలో రాజీ పడేదిలేదని ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై శనివారం జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు చేసుకోకుండా తదితర వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పాఠశాలలకు వెళ్లి బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించాలని సూచించారు. ఇది పిల్లలను లైంగిక నేరాల నుంచి రక్షించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అధికారులు తమ సిబ్బందితో నిరంతరం సమావేశాలు నిర్వహించుకొని, పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలన్నారు. నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చేవారితో మర్యాదగా ప్రవర్తించాలని తెలిపారు. డీఎస్పీ స్థాయి అధికారులు వారివారి పరిధిలో ప్రతి నెలా కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్స్ నిర్వహించి, ప్రజలకు మరింత దగ్గర కావాలని సూచించారు. జిల్లాలో గ్యాంగ్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. జిల్లాను గంజాయి, డ్రగ్స్ రహితంగా మార్చడానికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.