
ధాన్యం సేకరణకు సిద్ధంకండి
అనంతగిరి: ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం సేకరణకు సిద్ధం కావాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ధాన్యం కొనుగోలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సన్న రకం వడ్ల సేకరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో లక్షా 5వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు వివరించారు. ఇందులో దొడ్డు రకం 31,200 మెట్రిక్ టన్నులు, సన్న రకం 73,800 మెట్రిక్ టన్నులు సేకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. వర్షాలను దృష్టిలో పెట్టుకొని ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అన్ని యంత్రాలను, గన్నీ బ్యాగులను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. సమావేశంలో డీఆర్‌ఓ శ్రీనివాస్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి రాజరత్నం, డీసీఎస్‌ఓ సుదర్శన్, డీఎంసీఎస్ మోహన్ కృష్ణ, మార్కెటింగ్ అధికారి సారంగపాణి, డీసీఓ నాగార్జున, డీసీఎంఎస్ మార్కెటింగ్ మేనేజర్ వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అవకతవకలకు పాల్పడితే చర్యలు
మీసేవ కేంద్రం నిర్వాహకులు సర్టిఫికెట్ల జారీ విషయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని లింగ్యానాయక్ హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీసేవ కేంద్రం నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన రసుం మాత్రమే వసూలు చేయాలని ఆదేశించారు. అలా కాకుండా ఎక్కువ తీసుకుంటే మీసేవ కేంద్రం గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు. మీసేవ కేంద్రాలను వ్యాపార పరంగా కాకుండా సేవా దృక్ఫథంతో నడపాలని సూచించారు. సమయపాలన పాటిస్తూ ప్రజలు, రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలని తెలిపారు. అనుమతి పొందిన ప్రాంతాల్లోనే కేంద్రాలను నిర్వహించాలని, వేరే చోటికి మార్చాల్సి వస్తే అధికారుల నుంచి అనుమతి పొందాలని పేర్కొన్నారు. కేంద్రాల నిర్వహకులు ఇబ్బంది పెడితే 1100 కాల్ చేయాలని ప్రజలకు సూచించారు. సమావేశంలో జిల్లా మేనేజర్ మహమూద్, మీసేవ కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.