అన్నదాత అరిగోస | - | Sakshi
Sakshi News home page

అన్నదాత అరిగోస

Aug 23 2025 6:37 AM | Updated on Aug 23 2025 6:37 AM

అన్నదాత అరిగోస

అన్నదాత అరిగోస

● ఆగ్రోస్‌, డీసీఎంఎస్‌, పీఏసీఎస్‌లను ఆశ్రయిస్తున్న రైతులు ● కృత్రిమ కొరత సృష్టిస్తున్న ప్రైవేటు డీలర్లు

వానాకాలం సీజన్‌కు అవసరమైన ఎరువులు 1,13,851 మెట్రిక్‌ టన్నులు

అందుబాటులో ఉన్నది 6,230 మెట్రిక్‌ టన్నులు

అవసరమైన యూరియా 39,898 మెట్రిక్‌ టన్నులు

ప్రస్తుతం ఉన్నది 1,138 మెట్రిక్‌ టన్నులు మాత్రమే

ప్రైవేటు డీలర్ల వద్ద 876 మెట్రిక్‌ టన్నులు

సొసైటీల వద్ద 261 మెట్రిక్‌ టన్నులు

యూరియా కోసం దుకాణాల వద్ద క్యూ

వికారాబాద్‌: ఎరువుల కొరత లేదని అధికారులు అంటున్నా ఫెర్టిలైజర్‌ దుకాణాలు, ఆగ్రోస్‌, డీసీఎంఎస్‌, పీఏసీఎస్‌ల వద్ద భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. నిత్యం రైతులు పడరాని పాట్లు పడుతు న్నారు. ఎరువుల విక్రయాల్లో ప్రైవేటు డీలర్లు మాయాజాలం సృష్టిస్తుండగా వ్యవసాయ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌, ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాల్లో యూరియా నిల్వలు తక్కువగా ఉండటంతో వారు చేతులెత్తేస్తున్నారు. ఐదు ఎకరాల పొలం ఉన్న రైతుకు ఒకటి లేదా రెండు బస్తాలు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. ప్రైవేటు డీలర్ల వద్ద అధిక మొత్తంలో నిల్వలు ఉన్నా ఎంత స్టాక్‌ ఉందో చెప్పడం లేదు. నోటీసు బోర్డులో వివరాలు పొందుపరచడం లేదు. కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు. సొసైటీలకు నామమాత్రంగా కేటాయించి ప్రైవేటు డీలర్లకు ఎక్కువ మొత్తంలో సరఫరా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కొందరు వ్యవసాయాధికారులు డీలర్లతో కుమ్మక్కవటంతో ఈ పరిస్థితి నెలకొందనే విమర్శలు ఉన్నాయి.

యూరియా కోసం అవస్థలు

ఎరువుల కొరత రైతన్నను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పది రోజుల తర్వాత వర్షాలు కాస్త తగ్గుముఖంపట్టడంతో యూరియా కొనుగోలుకు రైతులు ఎగబడుతున్నారు. ఫెర్టిలైజన్‌ దుకాణాల్లో స్టాకు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఒక్కో రైతుకు రెండు బస్తాలు ఇస్తుండటంతో మళ్లీ మళ్లీ కొనేందుకు వస్తున్నారు. ప్రస్తుతం పత్తి, కంది, మొక్కజొన్న తదితర పంటలకు పైపాటిగా ఎరువులు వేస్తున్నారు. ఇదే సమయంలో వరినాట్లు కూడా ముమ్మరంగా వేశారు. ఈ పరిస్థితుల్లో యూరియాకు డిమాండ్‌ పెరిగింది. జిల్లాకు అవసరమైన ఎరువుల్లో 25 శాతం కూడా అందుబాటులో లేవని తెలిసింది.

ప్రైవేటు డీలర్ల వద్దే..

జిల్లాలో ఎరువుల అవసరం కొండంత ఉంటే అందుబాటులో ఉన్నది గోరంత మాత్రమే. ప్రస్తుతం 5,00,435 ఎకరాల్లో ఆయా పంటలు వేశారు. ఇందుకు 1,13,851 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం 6,230 మెట్రిక్‌ టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 39,898 మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం కాగా 15 వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే పంపిణీ చేశారు. ప్రస్తుతం 1,138 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉంది. ఇందులో ప్రైవేటు డీలర్ల దగ్గర 876 మెట్రిక్‌ టన్నులు, ఆయా సొసైటీల వద్ద 261 మెట్రిక్‌ టన్నులు ఉంది. ప్రైవేటు డీలర్ల వద్ద 5,314 మెట్రిక్‌ టన్నులు సొసైటీల వద్ద 916 మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఉంది. ఇలా ఉన్న వాటిలో ఎక్కువ శాతం ప్రైవేటు డీలర్లకే కేటాయించారు.

డిమాండ్‌ ఎక్కువగా ఉంది

జిల్లాలో ఎంత మేర ఎరువులు కావాలో నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాం. ప్రస్తుత అవసరాలకు ఎలాంటి కొరత లేదు. డిమాండ్‌ ఎక్కువగా ఉంది. అవసరం మేరకు డీఏపీ, యూరియాని అందుబాటులో ఉంచుతున్నాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏరోజుకారోజు తెప్పించి పంపిణీ చేస్తున్నాం.

– రాజరత్నం, జిల్లా వ్యవసాయాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement