
హామీలన్నీ అమలు చేస్తున్నాం
అనంతగిరి: బురాన్‌పల్లిని దత్తత తీసుకొని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆ గ్రామంలో పనుల జాతర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రూ.20 లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.63 లక్షలతో పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి బురాన్‌పల్లి వరకు ఆరు కొత్త బీటీ రోడ్లు, మరో రూ.63 లక్షలతో బురాన్‌పల్లి – ధన్నారం బీడీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగు పడితే అన్ని హామీలు నెరవేరుస్తామన్నారు. గత ప్రభుత్వం రూ. 6వేల కోట్లు అప్పు చేసిందని, వీటికి రూ.6,500 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నట్లు తెలిపారు. అయినా సంక్షేమం, అభివృద్ధి కొనసాగిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం ఒక్క ఇల్లు, రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులందరికీ ఇళ్లు, రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం రద్దు చేసిన అసైన్మెంట్ కమిటీని పునరుద్ధరించి భూములు లేని పేదలకు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని తహసీల్దార్‌కు సూచించారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేకుండా రూ.10 లక్షలు చొప్పున అందించడం జరుగుతుందన్నారు. ఉపాధి హామీ పథకం కింద ఉద్యానవన మొక్కలు నాటేందుకు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ శ్రీనివాస్, ఆర్టీఏ సభ్యులు జాఫర్, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ వినయ్ కుమార్, పంచాయత్ రాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, మండల పంచాయతీ అధికారి దయానంద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, నాయకులు మనోహర్‌గౌడ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.