
విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలి
అనంతగిరి: రాష్ట్రంలో విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని సాధన ఎన్జీవో డైరెక్టర్ చిక్కు మురళీమోహన్ పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోని డైట్ కళాశాలలో యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ యూనిట్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అన్వర్ పాషా, సాధన సంస్థ జిల్లా కోఆర్డినేటర్ రమేష్ యాదవ్‌తో కలిసి విద్యాహక్కు చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం సక్రమంగా అమలయ్యేందుకు ప్రభుత్వం ఒక పంచవర్ష ప్రణాళిక విధానాన్ని రూపొందించాలని తెలిపారు. విద్యా సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర జనాభాలో బాలల సంఖ్య సుమారు 40 శాతానికి పైగా ఉందని, దీనిపై సమగ్రమైన సర్వే నిర్వహించి, బాల కార్మికుల సంఖ్యను వాస్తవికంగా నిర్ధారించాలని డిమాండ్ చేశారు. 18 ఏళ్లలోపు బాల బాలికలందరికీ ఉచిత నిర్భంద విద్య అందేలా చట్ట సవరణ చేయాలని కోరారు. అనంతరం సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎహెచ్‌టీయూ హెడ్ కానిస్టేబుల్ అలీమోద్దీన్, అసిస్టెంట్ కోఆర్డినేటర్ నర్సింహులు, సఖీ సెంటర్ కోఆర్డినేటర్ యశోద, లీగల్ కౌన్సిలర్ సుమలత, షీటీం ప్రతినిధి రేష్మ, డైట్ కళాశాల సూపరింటెండెంట్ హుస్సేన్ సయ్యద్, ధారూర్ మాజీ సర్పంచ్ చంద్రమౌళి, సంస్థ ప్రతినిధులు అంజయ్య, ఆసీమ, రోజా, ప్రకాశ్ పాల్గొన్నారు.
సాధన ఎన్జీవో డైరెక్టర్ మురళీమోహన్