
కార్మికులను పర్మినెంట్ చేయాలి
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్
తాండూరు టౌన్: తాండూరు మున్సిపాలిటీలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట పలువురు నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏళ్ల తరబడిగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్నారు. వారందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలని, అప్పటి వరకు నెలకు రూ.26 వేల చొప్పున కనీస వేతనం చెల్లించాలన్నారు. కార్మికుల పీఎఫ్‌ను వారి ఖాతాల్లో సక్రమంగా జమ చేయడం లేదని, ఈఎస్‌ఐ అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. కార్మికులకు పెండింగ్‌లో ఉన్న యూనిఫాంలు, సబ్బులు, నూనె వెంటనే అందించాలని, డ్రైవర్ల వేతనాలను పెంచాలని, లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామన్నారు. కార్యక్రమంలో మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వాహబ్, సీఐటీయూ తాండూరు మున్సిపల్ వర్కర్స్ గౌరవాధ్యక్షుడు రాములు, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్, నాయకులు భాస్కర్, అశోక్, గోపి, ముకుంద్, లక్ష్మణ్, మల్లప్ప, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.