
ముంచెత్తిన వాన!
జిల్లాలోని పలు చోట్ల సోమవారం వర్షం దంచి కొట్టింది. పంట పొలాలు, రోడ్లు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. బొంరాస్‌పేట మండలం ఎన్కేపల్లి వద్ద వాగు దాటేందుకు రైతులు ఇబ్బంది పడ్డారు. తాడు సాయంతో అవతలి ఒడ్డుకు చేరుకుని వ్యవసాయ పనులు చేసుకున్నారు. బషీరాబాద్ మండలం జీవన్గీ గ్రామాన్ని వరద నీరు ముంచెత్తింది. ఇళ్లలోకి చేరిన నీటితో జనం అవస్థలు పడ్డారు. ధారూరు మండలం కోట్‌పల్లి ప్రాజెక్టుకు ఒక్క రోజులోనే మూడు అడుగుల నీరు చేరింది. ఎగువ ప్రాంతంలో కరుస్తున్న వర్షాలకు వాగుల ద్వారా వరద ప్రవాహం పెరిగిందని ఇరిగేషన్ డీఈ భాస్కర్‌గౌడ్ తెలిపారు. ఆదివారం ఉదయం వరకు 16 అడుగుల మేరకు నీరు చేరగా అదే రోజు రాత్రి నుంచి సోమవారం ఉదయానికి వరద నీరు మూడు అడుగుల వరకు పెరిగిందని పేర్కొన్నారు. మంగళవారం ఉదయం వరకు మరో అడుగు చేరేఅవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 19 అడుగుల నీరు ఉన్నట్లు వివరిచారు.
– వికారాబాద్/ధారూరు