
ఆర్టీసీ బస్సులో డీజిల్ చోరీ
కేశంపేట: నైట్ హాల్ట్ ఆర్టీసీ బస్సు నుంచి గుర్తు తెలియని దుండగులు డీజిల్ దొంగిలించారు. ఈ ఘటన మండల పరిధిలోని కొండారెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. కొండారెడ్డిపల్లి గ్రామానికి ఫలక్‌నుమా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అప్జల్‌గంజ్ నుంచి కొండారెడ్డిపల్లి గ్రామానికి రాకపోకలను సాగిస్తుంది. రాత్రి కొండారెడ్డిపల్లి గ్రామంలోనే బస్సు నిలుపుతారు. ఆదివారం రాత్రి బస్సును నిలిపి, డ్రైవర్, కండక్టర్లు నిద్రించారు. ఇదే అదునుగా భావించిన గుర్తుతెలియని దొంగ అర్టీసీ బస్సు నుంచి సుమారుగా 90 లీటర్ల డీజిల్‌ను దొంగిలించాడు. డ్యూటీ డ్రైవర్ రిపోర్టింగ్ సమయంలో చోరీ జరిగినట్లు గుర్తించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామానికి చెందిన పల్లె బాలీశ్వర్ రూ.5 వేలు, కానం ప్రేమ్‌కుమార్‌గౌడ్ రూ.3 వేలు వెచ్చించి డీజిల్ పోయించారు. ఈ ఘటనపై కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.
విద్యుదాఘాతంతో
పాడిగేదె మృతి
కొందుర్గు: విద్యుదాఘాతంతో పాడిగేదె మృతి చెందిన ఘటన సోమవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివారలు.. గ్రామానికి చెందిన రాయికంటి బలరాం పాడిగేదెలను పోషిస్తూ జోవనోపాధి పొందుతున్నాడు. పాడిగేదెను మేపుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కుగురై అక్కడిక్కడే మృతి చెందింది. మృతి చెందిన గేదె విలువ సుమారు రూ.80 వేలు ఉంటుందని.. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని రైతు ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.