
విగ్రహాల ధ్వంసం దారుణం
రాజేంద్రనగర్: శివరాంపల్లిలోని బంగారు మైసమ్మ దేవాలయంలోని విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని బీజేపీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి వై.శ్రీధర్ డిమాండ్ చేశారు. నిందితున్ని వెంటనే గుర్తించి అరెస్ట్ చేయకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించిన వ్యక్తిని.. అతడి వెనుక ఉన్న వారిని అరెస్ట్ చేయాలన్నారు. బంగారు మైసమ్మ దేవాలయం ఆవరణలోకి ఆదివారం ఉదయం ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ యువకుడు దేవాలయంలోని విగ్రహాలను పాక్షికంగా ధ్వంసం చేసి పారిపోయాడు. నిందితుడు వెళ్లిన అనంతరం దేవాలయానికి వచ్చిన భక్తులు ఈ విషయాన్ని గమనించి స్థానికులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు వై.శ్రీధర్, మహిపాల్ రెడ్డి, హరికిషన్ జీ, సందీప్ ముదిరాజ్, ప్రభాకర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, యువకులు పెద్ద ఎత్తున దేవాలయ ప్రాంగణంలోకి చేరుకున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని పట్టుకొని శిక్షిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. ఈ విషయమై రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి వై.శ్రీధర్ మాట్లాడుతూ... దేవాలయాలపై దాడులు సహించరానిదన్నారు. నిందితులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా కుట్ర జరుగుతుందని ఆరోపించారు. రానున్న గణేష్ ఉత్సవాల నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
దుండగుడిని కఠినంగా శిక్షించాలి
బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్