బీటీ రోడ్డుకు బ్రేక్!
యాలాల: మండల పరిధిలోని అడాల్‌పూర్ గ్రామానికి వేస్తున్న బీటీ రోడ్డు పనులకు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఉన్న మెటల్ రోడ్డు మార్గం అటవీశాఖ పరిధిలోని వస్తోందంటూ ఆ శాఖ అధికారులు పనులను అడ్డుకోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
రూ.2.30 కోట్ల నిధులు మంజూరు
అడాల్‌పూర్‌కు వెళ్లేందుకు తాండూరు మండలం బిజ్వార్ శివారు నుంచి రాకపోకలకు ఉన్న మార్గంలో దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం మీదుగా ఉంది. ఈ క్రమంలో 2012లో మెటల్ రోడ్డు నిర్మించారు. ప్రతీ ఏడాది వర్షాకాలంలో ఈ మార్గం మీదుగా వెళ్లేందుకు గ్రామస్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీంతో పంచాయతీ రాజ్ శాఖ నుంచి 3.25 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి గాను రూ.2.30 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇదే మార్గంలో ఐదు చోట్ల కల్వర్టులున్నాయి. ఇటీవల కాంట్రాక్టర్ పనులు ప్రారంభించడంతో సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సిబ్బందితో కలిసి వచ్చి పనులు నిలిపివేయించారు. దీంతో గ్రామస్తులు, మాజీ ప్రజాప్రతినిధులు తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి సమస్య వివరించి పనులు పూర్తయ్యేలా చూడాలని కోరారు.
దరఖాస్తు చేసుకోవాలని సూచించాం
బిజ్వారం శివారు నుంచి అడాల్‌పూర్ వరకు వేస్తున్న రోడ్డు అటవీ శాఖ పరిధిలోకి వస్తుంది. దీంతో 1.67 కిలోమీటర్ల భూభాగం కోల్పోతున్నాం. ప్రభుత్వ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని నాలుగు నెలల క్రితమే గ్రామస్తులకు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులకు సూచించినా వారు పట్టించుకోలేదు. ఇప్పటికే అడాల్‌పూర్ నుంచి షేక్‌పీర్ల గుట్ట మీదుగా కమాల్‌పూర్ వరకు ఉన్న రోడ్డు సైతం అటవీశాఖ పరిధిలోనిదే. ఈ విషయంలో గ్రామస్తులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి అనుమతి కోరుతూ నివేదిస్తే రెండు నెలల్లో అనుమతులు వచ్చే అవకాశం ఉంది. అనుమతులు వచ్చాక బీటీ రోడ్డు పనులు చేపట్టవచ్చు.
– రాజేందర్, ఫారెస్టు రేంజ్ అధికారి
నిలిచిన అడాల్‌పూర్ రోడ్డు నిర్మాణం
అటవీశాఖ పరిధిలోకి వస్తుందని అడ్డుకున్న అధికారులు
ప్రభుత్వ అనుమతి తీసుకున్నాకే పనులు చేపట్టాలని సూచన
ఆందోళనలో గ్రామస్తులు


