
నవాబుపేట: మద్యం మ త్తులో వాహనం నడిపిన డీసీఎం డ్రైవర్ ఓ రైతు నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం మండల పరిధిలోని వట్టిమీనపల్లిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ అరుణ్‌కుమార్, స్థానికులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన గొల్ల కిష్టయ్య(54) మధ్యాహ్నం పశువులను మేపేందుకు పొలానికి వెళ్తున్నాడు. శంకర్‌పల్లి నుంచి మద్యం మత్తులో డీసీఎంను నడుపుతున్న డ్రైవర్ రైతును ఢీకొట్టాడు. దీంతో కిష్టయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన రైతులు వాహనాన్ని వెంబడించగా మరింత వేగంగా వెళ్లి పులుమామిడి గేటు వద్ద కల్వర్టుని ఢీకొట్టి పక్కనే ఉన్న గుంతలోకి దూసుకెళ్లి వాహనం నిలిచిపోయింది. డ్రైవర్‌ను పట్టుకున్న గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. మృతుడికి భార్య స్వరూప, కొడుకు మల్లేశ్, ఇద్దరు కుమార్తెలున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.