50,406
దరఖాస్తులు
మండలాల వారీగా..
మండలం పేరు వచ్చిన దరఖాస్తులు
బంట్వారం 1,182
బషీరాబాద్ 2,125
బొంరాస్‌పేట్ 2,180
చౌడాపూర్ 1,741
ధారూరు 2,380
దోమ 3,136
దౌల్తాబాద్ 1,971
దుద్యాల్ 1,904
కొడంగల్ 2,156
కొడంగల్(మున్సిపల్) 760
కోట్‌పల్లి 1,141
కుల్కచర్ల 3,311
మర్పల్లి 1,964
మోమిన్‌పేట్ 1,804
నవాబుపేట్ 1,494
పరిగి 2,615
పరిగి(మున్సిపల్) 604
పెద్దేముల్ 3,200
పూడూరు 2,320
తాండూరు 3,456
తాండూరు(అర్బన్) 2,350
వికారాబాద్ 1,423
వికారాబాద్(అర్బన్) 2,903
యాలాల 2,286
మొత్తం 50,406
వికారాబాద్: జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకం కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అధికారులు ముమ్మరం చేశారు. యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తెచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 14వ తేదీ వరకు యువత నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఎంపీడీఓల పర్యవేక్షణలో పరిశీలనను పూర్తి చేశారు. ప్రస్తుతం ప్రొసీడింగులు తయారీలో నిమగ్నమయ్యారు. జూన్ ఒకటిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సంతకంతో కూడిన ప్రొసిడింగులు జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని లబ్ధిదారులకు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అత్యధికంగా తాండూరు నుంచి..
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల నుంచి రాజీవ్ యువ వికాసం పథకం కోసం దరఖాస్తులు స్వీకరించారు. అత్యధికంగా తాండూరు మండలంలో 3,456 మంది యువకులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోగా కొడంగల్ మున్సిపాలిటీలో అత్యల్పంగా 760 మంది మాత్రమే అర్జీలు ఇచ్చారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం వచ్చిన వాటిని మండలాలు, మున్సిపాలిటీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల వారీగా విభజించి వెరిఫికేషన్ పూర్తి చేశారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, 20 మండలాల నుంచి 50,406 దరఖాస్తులు వచ్చాయి. లబ్ధి దారులు ఎంపిక చేసుకున్న యూనిట్ ధరను బట్టి రూ.లక్ష నుంచి గరిష్టంగా రూ.4 లక్షల వరకు రాయితీపై రుణాలు అందజేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అనే తేడా లేకుండా అన్ని సామాజిక వర్గాల వారికి ఒకే రకమైన రాయితీ వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో రూ.లక్ష వరకు 90శాతం రాయితీపై రుణాలు అందజేయనున్నారు. రూ.2 లక్షల వరకు 80శాతం రాయితీ వర్తించనుండగా రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు రుణం పొందే వారికి 70 శాతం రాయితీ వర్తించనుంది.
ఎంపికలో తర్జన భర్జన
మండల పరిషత్ అభివృద్ధి అధికారుల పర్యవేక్షణలో ఎంపిక ప్రక్రియ చేపడుతుండగా.. ఇందులో బ్యాంకర్లను కూడా భాగస్వాములను చేస్తున్నారు. అయితే బ్యాంకు సిబిల్ స్కోర్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎంపిక ప్రక్రియలో తమ ప్రమేయం ఏమీలేదని.. అంతా పారదర్శకంగా చేపడుతున్నామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు పేర్కొంటున్నారు. అయితే నేతల కనుసన్నల్లోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్నట్లు సమాచారం. దీంతో దరఖాస్తు చేసుకున్న యువకులు ఎమ్మెల్యేలు.. అధికార పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల రూ.3లక్షలు, రూ.4 లక్షల యూనిట్లు మంజూరు చేయాలంటే తమ చేతులు తడపాలని కొందరు నేతలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకానికి వచ్చిన అర్జీలు
వెరిఫికేషన్ ప్రక్రియ దాదాపు పూర్తి
మండలస్థాయిలోనే లబ్ధిదారుల ఎంపిక
ప్రొసీడింగుల తయారీలో అధికారులు బిజీ
రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా పథకం అమలు
ఒక్కో యూనిట్‌కు గరిష్టంగా రూ.4 లక్షల వరకు..
70 నుంచి 90శాతం వరకు రాయితీ


